పెద్దఎత్తున కాయకల్పచికిత్స జరుగనుందా?=కాంగ్రెస్‌లో

దేశవ్యాప్తంగా యువతరాన్ని ఆకర్షించేందుకు ఒకపద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ ముందుకు వెళుతున్నదా? పాతతరం అంతటికీ స్వస్తి చెప్పి కొత్తతరాన్ని ముందుకు తేనున్నదా? కాంగ్రెస్‌లో అతిత్వరలో పెద్దఎత్తున కాయకల్పచికిత్స జరుగనుందా? ఈ ప్రశ్నలకు జవాబులు రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత లభించనున్నాయి. కాంగ్రెస్‌లో పెద్దఎత్తున జరుగుతున్న ఈ భారీ మార్పులు భారతీయ జనతా పార్టీలో ప్రకంపనలు సృష్టించనున్నాయి. గత ఎన్నికల్లో యువతను ఆకర్షించి, అవినీతిని నిర్మూలించి, స్వచ్చమైన రాజకీయాలను ప్రవేశపెడతామన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వాగ్ధానాలు ఇంకా నెరవేరలేదు.rahul-gandhi-tells-revanthnpp

ఈ పరిస్థితుల్లో యువతరానికి కాంగ్రెస్‌ పట్టంకట్టడం బీజేపీ నుంచి యువతను దూరం చేయడానికేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాహుల్‌గాంధీని యువత అంగీకరించే పరిస్థితులు కనపడుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ రాహుల్‌ను పప్పూగా అభివర్ణించిన వారే రాహుల్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. రాహుల్‌ మాట్లాడే తీరు వారికి నచ్చుతున్నది. గుజరాత్‌లో రాహుల్‌ వైపు కాలేజీ విద్యార్థులు, యువకులు మొగ్గు చూపుతున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి ముందుకు వస్తున్నారు.

గుజరాత్‌లోనే కాకుండా గత కొంతకాలంగా రాహుల్‌గాంధీ యువతతో సంప్రదింపులు జరుపుతున్నారు. కళాశాలలకు యూనివర్సిటీలకు వెళుతున్నారు. హైదరాబాద్‌ యూనివర్సిటీలో దళిత యువకుడు రోహిత్‌ వేముల ఆత్మహత్య తర్వాత ఆ యూనివర్సిటీకి వెళ్లిన రాహుల్‌ దళిత, బీసీ యువ వర్గాలను ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. ఆగ్రవర్ణ యువత మోడీ వైపు మొగ్గు చూపుతుంటే క్రిందివర్గాల యువత రాహుల్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నది. దేశవ్యాప్తంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై, బీసీలపై అత్యాచారాలు జరిగాయి. ఇది రాహుల్‌కు అనుకూలంగా మారింది.

ఇదే అదనుగా రాహుల్‌గాంధీ కూడా పార్టీలో పెద్దఎత్తున యువతరాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. నవంబర్‌ నెలలోనే రాహుల్‌గాంధీ పార్టీపగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వచ్చేనెల కాంగ్రెస్‌ సదస్సు జరుగనుంది ఇదే సదస్సులో పార్టీ నేతలు రాహుల్‌ అధ్యక్ష పదవి చేపట్టడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఏమి జరుగుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఉన్నది. కాంగ్రెస్‌లో ఇప్పటికీ కురువృద్దులు పెత్తనం చలాయిస్తున్నారు. పార్టీలో అందరికన్నా కురువృద్దుడు మోతీలాల్‌ వోరా వయస్సు 88 సంవత్సరాలు. ఆయన ఇంకా కోశాధికారిగా పార్టీ ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్నారు.

ఇక పార్టీలో జనార్దన్‌ ద్వివేదీ వయస్సు 72 సంవత్సరాలు. వాయలార్‌ రవి వయస్సు 80 సంవత్సరాలు. దిగ్విజయ్‌ సింగ్‌ వయస్సు 70 సంవత్సరాలు. గులాంనబీ ఆజాద్‌ వయస్సు 69 సంవత్సరాలు, అహ్మద్‌ పటేల్‌ వయస్సు 68 సంవత్సరాలు. ఎకె ఆంథోనీ వయస్సు 76 సంవత్సరాలు. సుశీల్‌ కుమార్‌ షిండే వయస్సు 76 సంవత్సరాలు. ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ వయస్సు 76 సంవత్సరాలు. అంబికా సోనీ వయస్సు 74 సంవత్సరాలు.

చిదంబరం వయస్సు 72 సంవత్సరాలు. కపిల్‌ సిబల్‌ వయస్సు 69 సంవత్సరాలు. కమల్‌నాథ్‌ వయస్సు 70 సంవత్సరాలు. ఇలా పార్టీలో ఎక్కడ చూసినా కురువృద్దులే కనపడుతున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో అడుగుపెట్టినా, పార్లమెంట్‌ ఉభయసభలు చూసినా కాంగ్రెస్‌లో కనపడే యువసభ్యులు తక్కువ. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరందరి పాత్ర ఏముంటుందనే ప్రశ్న తలెత్తనుంది.

నిజానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ప్రస్తుతం నిర్వహిస్తున్న సోనియాగాంధీ వయస్సే 70 సంవత్సరాలు. కొంతకాలానికి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా లేక యూపీఏ చైర్‌పర్సన్‌గా మారనున్నారు. ఆమె స్థానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌గాంధీ వయస్సు 47 సంవత్సరాలు. ఇక సోనియా రాయబరేలీ నుంచి కూడా పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. ఆమె రాజ్యసభకు వస్తారని, ఆమె స్థానంలో ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని చెబుతున్నారు. ప్రియాంకాగాంధీ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఎన్నికలు మరు ఆరునెలలు ఉందనగా రంగప్రవేశం చేస్తారని తెలుస్తోంది. ఇక సోదరుడు, సోదరి ఎన్నికల ప్రచారానికి దిగితే నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు క్లిష్టపరిస్థితులు ఏర్పడుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

రాహుల్‌ పార్టీ అధ్యక్షుడైన తర్వాత అహ్మద్‌ పటేల్‌ సంగతి ఏమవుతుందన్న విషయం చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ అహ్మద్‌ పటేల్‌ సోనియాగాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడున్న నేతల్లో తక్కువ వయస్సు ఉన్న జైరాంరమేశ్‌(62) రాహుల్‌కు రాజకీయ కార్యదర్శిగా మారే అవకాశాలున్నాయి. రాహుల్‌గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అహ్మద్‌ పటేల్‌ సోనియాగాంధీ వద్ద కొనసాగవచ్చునని చెబుతున్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యర్శిగా ఉన్న జనార్దన్‌ ద్వివేదీ, సంస్ధాగత వ్యవహారాలు చూస్తున్న ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ కూడా సోనియాగాంధీకి పరమ విధేయులు. వీరి భవిష్యత్‌ ప్రశ్నార్థకం కానున్నది.

ఇక కోశాధికారిగా మోతీలాల్‌ వోరా స్థానంలో మాజీమంత్రి, సీనియర్‌ నేత మురళీ దేవర కుమారుడైన మిలింద్‌ దేవర బాధ్యతలు స్వీకరించవచ్చు. రాహుల్‌ వద్ద కీలక స్థానాలు స్వీకరించే యువనేతల్లో అజయ్‌ మాకెన్‌, జితేందర్‌ సింగ్‌, రణదీప్‌ సూర్జేవాలా తదితర నేతలకు కీలక స్థానాలు దక్కవచ్చు. మరీ 80 దాటిన వారిని వదుల్చుకోవచ్చు కాని 70పడిలో ఉన్న  గులాంనబీ ఆజాద్‌, దిగ్విజయ్‌ సింగ్‌, చిదంబరం, కపిల్‌ సిబల్‌ తదితరుల సేవలను మాత్రం రాహుల్‌ ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. వారిని మార్గదర్శక మండలిలోనూ, కేంద్ర ఎన్నికల కమిటీల్లోనూ, మేనిఫెస్టో కమిటీల్లోనూ చేర్చవచ్చు. రాజ్యసభ పెద్దల సభే కనుక వారికి అవకాశాలు కూడా ఉంటాయి. నరేంద్రమోడీలాగా సీనియర్లను అవమానించే ఉద్దేశం రాహుల్‌కు లేదు.

ఏమైనా యువత కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ రూపురేఖలు మారే అవకాశాలు కనపడుతున్నాయి. బీజేపీ నేతలు నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు అప్పుడు కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం కొంతకష్టమే అవుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *