ప్రధానులూ పదవీచ్యుతులయ్యారు

పనామా పత్రాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు
పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల పేర్లు బట్టబయలు
పలు దేశాల్లో నేటికీ కొనసాగుతున్న విచారణ..
రెండేళ్ల క్రితం పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. నాటి పత్రాల దెబ్బకు ఏకంగా ఇద్దరు ప్రధానులూ పదవీచ్యుతులయ్యారు. అనేక సంస్థలు మూతపడ్డాయి. కొందరు ప్రముఖులు, సంస్థలపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్యారడైజ్‌ పత్రాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి పనామా పత్రాల వ్యవహారం అందరికీ గుర్తుకొస్తోంది.
మనదేశంలోనూ కుదుపు
మనదేశంలోనూ పలువురు పన్నులు ఎగవేస్తూ విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు పనామా పత్రాలు బట్టబయలు చేశాయి. అందులో రాజకీయ నాయకులు, సినిమాతారలు సహా దాదాపు 500 మంది భారతీయుల పేర్లున్నాయి. వారిలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌, డీఎల్‌ఎఫ్‌ ప్రమోటర్‌ కె.పి.సింగ్‌ కూడా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకుగాను కేంద్రప్రభుత్వం బహుళ సంస్థలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది.
వందలాది సంస్థల మూసివేత
అక్రమ పెట్టుబడుల వ్యవహారం బయటపడటంతో చాలాదేశాలు ఆయా సంస్థలపై కొరడా ఝుళిపించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, స్వీడన్‌, నెదర్లాండ్స్‌ సహా పలుదేశాల్లో ‘పనామా’ సంబంధిత కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది. 33 మంది వ్యక్తులు/సంస్థలను అమెరికా వ్యాపార నిర్వహణకు సంబంధించి నిషేధిత జాబితాలో చేర్చింది.
అధినేతల బంధువులు, సన్నిహితులు..
చైనా అధ్యక్షుడి బావ, మలేసియా ప్రధాని కుమారుడు, అజర్‌బైజాన్‌ అధ్యక్షుడి పిల్లలు.. ఇలా చాలామంది పెట్టుబడుల వివరాలు పనామా పత్రాల వ్యవహారాల్లో బట్టబయలయ్యాయి. ఫుట్‌బాల్‌ స్టార్‌ లయోనెల్‌ మెస్సి(అర్జెంటీనా) సైతం విచారణ ఎదుర్కొన్నారు. తన తండ్రి దివంగత అయాన్‌కు చెందిన సంస్థల పెట్టుబడుల వ్యవహారంలో బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ సైతం దర్యాప్తు ఎదుర్కోవాల్సి వచ్చింది.