బాబు దిగిపోతేనే జాబు

ప్రభుత్వ ఉద్యోగులకు మంచిచేస్తా.. రైతులకు అండగా నిలుస్తాం
కాసుల కక్కుర్తి లేదు.. కేసులకు భయపడను
జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం
డిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని.. రైతులకు వ్యవసాయం పండగ చేయాలని, అధికారంలోకి వచ్చాక మద్యపానం పూర్తిగా తీసేయాలన్న కసి నాకుంది. నేను వెళ్లిపోయాక కూడా ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలి. అవినీతి మయం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని ఉంది. అవినీతిలో కూరుకున్న అందరినీ జైల్లో పెట్టించాలని ఉంది. అందుకు మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి
కాసులంటే కక్కుర్తి లేదు. కేసులంటే భయపడను. నాకు కసి ఉంది. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్నదే నా ఆశయం. నేను వెళ్లిపోయాక కూడా ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలి’ అని వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు వైఎస్‌ సమాధి వద్ద తన కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రగా వైఎస్‌ ఎస్టేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభ వద్దకు చేరుకుని ప్రసంగించారు. ‘చంద్రబాబు పాలనలో ఉద్యోగులు సంతోషంగా లేరన్నారు. ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పింఛను విధానం ఏడాది కాలంగా వద్దంటున్నా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పిన హామీనీ గాలికొదిలారు. ఈ విషయాల్లో తాను తప్పక మంచి చేస్తాను. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇంటి స్థలం, గృహం మంజూరు చేస్తాం. జాబు రావాలంటే బాబు పోవాలన్నదే తమ నినాదం. బాబు హయాంలో గ్రామాల్లో గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కరవైంది. ప్రజాప్రతినిధులకు అధికారాలు పోయి.. జన్మభూమి కమిటీలనే ముఠాలకు అధికారాలు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాను. ప్రజలకు తోడుగా నిలిచేందుకు పాదయాత్రకు వస్తున్నా. వైఎస్‌ ఎంత గొప్పవాడో జగన్‌ అంత మంచివాడని మీ అందరి చేత అనిపించుకుంటా.’ అని అన్నారు.