అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై పనేంటి?: కర్ణాటక హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

బెంగళూరులో రాత్రిపూట రోడ్లపై మహిళలు కనిపించకూడదు
అర్ధరాత్రి ఆఫీసుకు వెళ్తున్న మహిళలు కుటుంబసభ్యులను వెంటబెట్టుకెళ్లాలి
హోం మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటని కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో శాసనమండలిలో ‘మహిళా భద్రత’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై పని ఉండదు కనుక, ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదని అన్నారు. అంతే కాకుండా రాత్రివేళ ఆఫీసుకు వెళుతున్న ఓ మహిళకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజీని చూపిస్తూ ‘‘ఇలాంటి సమయంలో సదరు మహిళ తన బంధువులను తోడుగా తీసుకెళ్లాలి’’ అని ఉచిత సలహా ఒకటి పారేశారు.

అంతే కాకుండా బెంగళూరులో మొత్తం 1.2 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ భద్రత కల్పించడం తన వల్ల కాదని కూడా మంత్రి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. మహిళలకు పూర్తి భద్రత కల్పించాల్సిన హోం మంత్రే విస్తుబోయే ప్రకటన చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. చేతకానప్పుడు బాధ్యతల్లో కొనసాగడం ఎందుకని పలువురు మహిళా సంఘాల నేతలతో పాటు, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.