సిమెంటు రోడ్డుపై పరుగులు

తెలంగాణలో రెండు మార్గాల్లో ప్రయోగం
నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా
దీర్ఘకాలిక మన్నిక కోసమే..
తెలంగాణలో సిమెంట్‌ మార్గాల దిశగా అడుగులు పడ్డాయి. దీర్ఘకాలిక మన్నిక కోసం తొలిసారిగా రాష్ట్రంలోని రెండు మార్గాలను సిమెంటుతో నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రద్దీగా ఉండే మార్గాలను తొలిదశలో ఎంచుకున్నారు. తారుతో పోలిస్తే సిమెంటు రోడ్ల నిర్మాణ వ్యయం ఒకింత ఎక్కువైనా రహదారి మన్నిక గణనీయంగా ఉండటంతో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 2019 చివరి నాటికి ఈ రెండు మార్గాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన సిమెంటు మార్గాల మన్నిక ఆశాజనకంగా ఉండటంతో దశల వారీగా ఆ విస్తీర్ణాన్ని పెంచాలన్న యోచనలతో ప్రభుత్వాలున్నాయి. నిర్వహణ సమస్యలు తక్కువగా ఉండటం కూడా మరో కారణమని అధికారులు చెబుతున్నారు.
తగ్గిన వ్యత్యాసం
రహదారుల నిర్మాణంలో సాంకేతికతతోపాటు తారు-సిమెంటు మధ్య వ్యయ వ్యత్యాసం తగ్గుతుండటం కూడా దీనివైపు మొగ్గు చూపేందుకు కారణమవుతోంది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సిమెంటు రహదారులకు ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీయ రహదారుల ప్రమాణాల మేరకు కిలోమీటరు తారు రోడ్డు వేసేందుకయ్యే ఖర్చుకూ సిమెంటు రోడ్డు నిర్మాణానికయ్యే వ్యయానికి మధ్య వ్యత్యాసం అటూఇటుగా రూ.రెండు కోట్లుగా ఉంది. సిమెంటు రహదారుల మన్నికపై చేపట్టిన అధ్యయనాలు కూడా సానుకూలంగా ఉండటం, తారురోడ్డుపై నీరు నిలిచినప్పుడు వాహనాల రాకపోకల వల్ల త్వరగా దెబ్బతింటుండటం వంటి పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అధికారులు సిమెంటు రహదారుల ప్రయోగానికి మొగ్గుచూపుతున్నారు.
గణనీయ మన్నిక
తారు రోడ్డుతో పోలిస్తే సిమెంటు రహదారుల మన్నిక అధికమని నిపుణులు సైతం నిర్ధరిస్తున్నారు. తాజాగా జాతీయ రహదారులను కూడా సిమెంటుతో నిర్మించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. 235 కిలోమీటర్లతో దిల్లీ-ఆగ్రా మార్గాన్ని 2010లో సిమెంటుతో నిర్మించారు.
సిమెంటు రోడ్డుతో నిర్వహణ సులువుగా ఉంటోందని జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ప్రమాదాలపై వచ్చిన విమర్శలపై కేంద్ర రహదారుల పరిశోధన సంస్థ(సీఆర్‌ఆర్‌ఐ) నిర్వహించిన అధ్యయనం ప్రమాదాలకు-సిమెంటు రహదారులకు సంబంధం లేదని నిర్ధరించింది.
తెలంగాణలో చేపట్టే సిమెంటు మార్గాలు…
* యాదాద్రి నుంచి వరంగల్‌ వరకు 99 కిలోమీటర్లు. నాలుగు వరసలు. సింహభాగం సిమెంటుతో నిర్మాణం. నిర్మాణ వ్యయం రూ.857 కోట్లు. వచ్చే ఏడాది ఆగస్టుకు సిద్ధం కావాలి. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ(ఎన్‌హెచ్‌ఎఐ) ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
* నకిరేకల్‌ నుంచి తానంచర్ల వరకు 72 కిలోమీటర్లు. రెండు వరసలు. నిర్మాణ వ్యయం రూ.325 కోట్లు. పనులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల వ్యవధిలో పని పూర్తి చేయాల్సి ఉంది. రాష్ట్ర రహదారులు-భవనాలశాఖ పరిధిలోని జాతీయ రహదారుల విభాగం ఈ పనులను పర్యవేక్షిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *