శశికళ ఆస్తులు రూ. 5 లక్షల కోట్లు.. ఐటీ దాడుల్లో బయటపడిన కళ్లు చెదిరే వాస్తవం!

శశికళ బంధుగణంపై మరోమారు దాడులకు సిద్ధమవుతున్న ఐటీ
దేశవ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకున్న శశికళ
240 బ్యాంకు లాకర్లు గుర్తింపు
జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, బినామీలు, అనుచరగణంపై ఇటీవల దాడిచేసిన ఐటీ అధికారులు తాజాగా మరోమారు దాడులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించిన ఐటీ మరోమారు దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

శశికళ, ఆమె కుటుంబ సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలను కొనుగోలు చేసి, బినామీల ద్వారా వాటిని నిర్వహిస్తున్నట్టు తేలిందని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు. వాటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇటీవల పొయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసంలో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, పెన్‌డ్రైవ్‌లలో ఉన్న సమాచారాన్ని ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులోని సమాచారం ఆధారంగానే ఆమెకు దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నట్టు బయటపడింది. దీంతో మరోమారు తనిఖీలు నిర్వహించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలకు మొత్తం 240 బ్యాంకు లాకర్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

గతేడాది కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత శశికళ అనుయాయుల ఖాతాల్లో ఒకేసారి కోట్లాది రూపాయలు జమ అయినట్టు గుర్తించిన అధికారులు వాటిని స్తంభింపజేశారు. ఇప్పటి వరకు శశికళ ఇళ్లపై జరిపిన సోదాలకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ)కి ఐటీ విభాగం సమర్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *