రోమ్‌ తగలబడిపోతోంటే

రోమ్‌ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడట. అది నిజమో కాదోగానీ, ‘

padmavati-nppసినిమా పేరుతో దేశవ్యాప్తంగా ‘రచ్చ’ జరుగుతోంటే, కేంద్రంలో నరేంద్రమోడీ సర్కార్‌ మాత్రం, తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఓ సినిమా వివాదంలో, కేంద్రం అయినా రాష్ట్రం అయినా ఎందుకు తలదూర్చాలి.? అన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజమే. 

కానీ, ఇక్కడ వివాదం ‘పద్మావతి’ సినిమా గురించి కాదు.! ఆ సినిమా పేరుతో రెచ్చిపోతోన్న అసాంఘీక శక్తుల గురించి. ‘పద్మావతి’ సినిమాని అడ్డుకుంటామనడం, ఆందోళనలు చేయడం వరకూ బాగానే వుంది. కానీ, తలలు తెగ్గోసేస్తామనడమేంటి.? హీరోయిన్‌ దీపికా పడుకొనే తలకి వెల కట్టేశారు. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తలకీ రేటు కట్టేశారు. కోటి.. ఐదుకోట్లు.. పదికోట్లు.. ఇలా రోజుకొకరు తెరపైకొస్తున్నారు. పైగా, అధికార బీజేపీకి చెందిన నేతలు, ఆ పార్టీకి అత్యంత సన్నిహితంగా వుండేవారి నుంచి ఈ తరహా ప్రకటనలు రావడమే ఆశ్చర్యకరం. 

‘సినిమా విడుదలను అడ్డుకోలేం.. అది సెన్సార్‌ బోర్డ్‌ పరిధిలోని అంశం..’ అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చాక, ‘చంపేస్తాం..’ అనే హెచ్చరికల సంగతేంటి.? ‘భావోద్వేగాల నేపథ్యంలో..’ అని కొట్టిపారేయడానికి వీల్లేని సందర్భమిది. దేశంలో ‘అసహనం’ పెరిగిపోతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. ఇది నూటికి నూరుపాళ్ళూ ‘కాషాయ అసహనం’గానే భావించాల్సి వుంటుంది. 

కర్నాటక ప్రభుత్వం దీపికా పడుకొనే కుటుంబానికి భద్రత కల్పించడం, మరో ప్రభుత్వం సంజయ్‌ లీలా భన్సాలీకి భద్రత కల్పించడం కాదు ఇక్కడ కావాల్సింది. అసాంఘీక శక్తుల్లా పెచ్చిపోతోన్న సోకాల్డ్‌ కాషాయ దళం’ సభ్యుల్ని అదుపు చేయాల్సి వుందిప్పుడు. సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడేవారందర్నీ కాదు.. తలలు తెగ్గోస్తామన్నవారు స్వేచ్ఛగా జనంలో ఎలా తిరగ్గలుగుతున్నారట.? దేశ ప్రధానిగా, దేశంలో పెరిగిపోతోన్న ఈ ‘కాషాయ అసహనం’పై నరేంద్రమోడీ పెదవి విప్పాల్సిందే.