నేను చాయ్ అమ్మాను గానీ దేశాన్ని అమ్మలేదు

ప్రధాని నరేంద్రమోదీ రాకతో గుజరాత్‌లో మొదటి దశ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. కచ్ జిల్లాలోని భుజ్ పట్టణంలో సోమవారం జరిగిన సభలో మాట్లాడిన మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాది విడుదలైతే చప్పట్లు కొట్టారని, డోక్లాం ప్రతిష్టంభన సందర్భంగా వెళ్లి చైనా రాయబారిని ఆలింగనం చేసుకున్నారని ఆయన కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించారు. మీరు చైనా రాయబారిని సంతోషంగా హత్తుకుంటారు, హఫీజ్ సయీద్ విడుదలైతే చప్పట్లు కొడుతారు.. భారత సైన్యం జరిపిన లక్షిత దాడులను మీరు గౌరవించరు. అయినా వాటి గురించి ఎందుకు మాట్లాడుతారు, మౌనంగా ఉండవచ్చు కదా? అని వ్యాఖ్యానించారు. ముంబై ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ఇటీవల పాకిస్థాన్‌లో గృహ నిర్బంధం నుండి విడుదలైన సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా ప్రధానిపై విమర్శలు చేశారు. నరేంద్రభాయ్ మీ మాట చెల్లలేదా.. ఉగ్రవాదుల సూత్రధారి విడుదలయ్యాడు. లష్కరేకు అందుతున్న నిధులతో పాకిస్థాన్ మిలిటరీకి సంబంధం లేదని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. modinpp

మీ ఆలింగన దౌత్యం విఫలమైంది. మరిన్ని ఆలింగనాలు కావాలి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మోదీ ఈ ఎన్నికలు అభివృద్ధిపై విశ్వాసానికి, వారసత్వ రాజకీయాలకు మధ్య పోటీ అని అన్నారు. పాకిస్థాన్ కోర్టు ఓ ఉగ్రవాదిని విడుదల చేస్తే కాంగ్రెస్ వారు ఎందుకు చప్పట్లు కొడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను గుజరాత్ పుత్రుడనని, తన ప్రజా జీవితంలో ఎటువంటి మచ్చ లేదని చెప్పుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు భూమి పుత్రునిపై ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు వారిని క్షమించరని అన్నారు. కాంగ్రెస్‌కు నీతి, నియ్యత్, నేత, నాత లేదని వ్యాఖ్యానించారు. అనంతరం రాజ్‌కోట్‌లో జరిగిన మరో సభలో మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనను చాయ్‌వాలా అంటూ చేసిన విమర్శలను తిప్పి కొట్టారు. తాను కేవలం చాయ్ అమ్మానని దేశాన్ని అమ్ముకోలేదని అన్నారు. యూత్ కాంగ్రెస్ వారు ఇటీవల మోదీని చాయ్‌వాలా అని పేర్కొంటూ ట్విట్టర్‌లో ఒక మీమ్ పోస్ట్ చేసి, వెంటనే దానిని తొలిగించారు. తాను పేదవాడినైనందుకే కాంగ్రెస్ తనను ఇష్టపడటం లేదని మోదీ అన్నారు. ఓ పార్టీ ఇంత హీనస్థితికి దిగజారుతుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు. 

సానుభూతి కోసం ప్రధాని ప్రయత్నిస్తున్నారు: కాంగ్రెస్

తనను చాయ్‌వాలా అన్నారని చెప్పుకొంటూ ప్రధాని ప్రజల నుండి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మార్కెటింగ్‌లో నరేంద్రమోదీ నిపుణుడు. ఓ పదవిలో ఉన్న వ్యక్తి పనితీరును గురించి చర్చిస్తారు తప్ప అతని ఆర్థిక స్థితి గురించి కాదు. ఎన్నికల ముందు సానుభూతి పొందేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారు అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మాజీ ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, మన్మోహన్‌సింగ్ కూడా పేద కుటుంబాల నుంచే వచ్చారని, ఆ సంగతి మోదీ మరిచిపోయారని కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌శర్మ విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ గుజరాత్‌కు ఏమీ చేయలేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ఆ రాష్ట్ర దళిత నాయకుడు జిగ్నేశ్ మేవాని సోమవారం ప్రకటించారు.jignesh-mevaninpp బనస్‌కాంఠా జిల్లాలోని వడాగావ్ ఎస్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని, తనకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతునిస్తాయని తెలిపారు. జిగ్నేశ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు వడాగావ్ స్థానం నుంచి తనను పోటీ చేయవద్దని పార్టీ అధిష్ఠానం కోరిందని కాంగ్రెస్ నాయకుడు మనీభాయ్ వాఘేలా చెప్పారు. ఆ స్థానంలో జిగ్నేశ్‌కు తమ పార్టీ పరోక్ష మద్దతునిస్తుందని తెలిపారు. ఉనాలో గత ఏడాది దళితులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా జిగ్నేశ్ మీడియా దృష్టిని ఆకర్షించారు. తదనంతరం ఆయన దళిత నేతగా ఎదిగారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మేవానీకి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా విజయ్ చక్రవర్తి పోటీచేస్తున్నారు. 

కాంగ్రెస్ తుది జాబితా విడుదల

నామినేషన్లకు ఆఖరు రోజున కాంగ్రెస్ పార్టీ తమ చివరి 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. గుజరాత్ రెండో దశ ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారం ముగిసింది. రెండు సీట్లను మిత్రపక్షాలకు వదిలి మిగిలిన స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఓబీసీల నాయకుడు అల్పేశ్ ఠాకూర్‌ను రాధాన్‌పూర్ నుంచి బరిలోకి దించింది. 

34 మందితో బీజేపీ చివరి జాబితా

బీజేపీ కూడా 34 మందితో తన ఆరవ తుది జాబితాను విడుదల చేసింది. మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్, మరో మంత్రితోపాటు ఐదుగురు సిట్టింగ్ సభ్యులకు బీజేపీ టికెట్లివ్వలేదు. మంత్రి రోహిత్ పటేల్‌ను ఈసారి పోటీ నుంచి బీజేపీ తప్పించింది.

TAGS;PM Narendra Modi  , Congress  , Gujarat Elections  , Rajkot  , Saurashtra  , Patel Community ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *