డబ్బులు కావాలని బెదిరించారు=హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ప్రజారవాణా వ్యవస్థలో అత్యున్నతస్థాయి గల మెట్రో రైలును హైదరాబాద్‌లో విజయవంతం చేసిన హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి (నల్లమిల్లి వెంకట సత్యనారాయణరెడ్డి) గురించి ఎంత చెప్పినా తక్కువే. మెట్రోకు మూల స్తంభంగా నిలిచిన ఆయన నగర ప్రజల చిరకాల కల నెరవేరడంలో కీలక పాత్ర పోషించారు. అడ్డంకులు, వివాదాలను దాటుకొని ప్రాజెక్టు ఎలా పూర్తయింది సార్.. అని ప్రశ్నిస్తే.. పదవీ విరమణపొందాక పుస్తకం రూపంలో వెల్లడిస్తానని చెప్తున్నారు. రాష్ట్రం విడిపోతే మెట్రో పనులు ఆగిపోతాయని తప్పుడు నివేదికలు ఇవ్వమన్నా ఎక్కడా తలొగ్గలేదని, చిత్తశుద్ధితో మెట్రో నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించానని అంటున్నారు. ఎన్వీఎస్ రెడ్డి మాటల్లోనే..nvsreddynpp

విజయకాంక్షతో పని చేశాం

మెట్రో నిర్మాణం వెనుక ఎన్నో అడ్డుంకులు, వివాదాలు.. అయినా ఎక్కడా అలసిపోలేదు. విజయకాంక్షతో పని చేశాం. ప్రజలు మెట్రోను ఎంతో ఆదరిస్తున్నారు. తొలిరోజు ఏకంగా రెండు లక్షల మంది ప్రయాణించారంటే ఇంతకన్నా మాకిచ్చే ఆశీర్వాదం ఏముంటుంది. ఒక గొప్ప విజయాన్ని సాధించామనే సంతోషం, తృప్తి మిగిలింది. ఇదే స్ఫూర్తితో మిగతా దశలను నవంబర్‌నాటికి పూర్తిచేస్తాం.

డబ్బులు కావాలని బెదిరించారు..

టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఎవరి లాభం వారు చూసుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక లీడర్లు ఇలా అందరూ డబ్బులు డిమాండ్ చేశారు. ఎల్‌అండ్‌టీ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అది ముందుకు వచ్చి నిర్మిస్తుంటే డబ్బులు కావాలని అడిగారు. వాటాలు పంచుకునేందుకు ప్రయత్నించారు. రాత్రి ళ్లు ఫోన్లు చేసి బెదిరించేవారు. అప్పటి నుంచే ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇచ్చింది. ఈ విషయాలన్నీ పదవీవిరమణ పొందాక పుస్తకం రాస్తా. అందులో అన్నీ వెల్లడిస్తా.

హ్యాట్సాఫ్ టు సీఎం..

నాకు నచ్చిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన సీఎం అయ్యాక నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఒక్క ప్రజాప్రతినిధిగాని, మరెవరూ నాకు ఫోన్ చెయ్యలేదు. ఉద్యోగాల విషయంలోగానీ, మరేదైన విషయంలోగానీ ఒత్తిడి లేదు. దేని గురించి నాకు ఇబ్బందులు తలెత్తలేదు. రాష్ట్రంలో పొలిటికల్ కరప్షన్ పూర్తిగా అంతమైంది. హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఆయన సహకారంతోనే మెట్రోరైలు విజయవంతమైంది. ప్రత్యేక దృష్టి సారిం చి అడ్డంకులు తొలిగించారు.

శ్రీకృష్ణ కమిటీకి తప్పుడు నివేదిక ఇవ్వమన్నారు..

రాష్ట్రం విడిపోతే మెట్రో ప్రాజెక్టు ఆగిపోతుందని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మెట్రో అంతగా విజయవంతం కాదని శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వమన్నారు. ఎందరో ఒత్తిడి చేశారు. ఒక ప్రాంతానికి అనుకూలంగా ఉంటున్నానని విమర్శించారు. అయినా వెనక్కి తగ్గలేదు. ఈ మహా ప్రాజెక్టు నిర్మాణం అనేది భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. దీన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకే ముందు నుంచి మెట్రో వల్ల కలిగే ప్రయోజనాలను వివరించా. ఈ ఇంజినీర్ల అద్భుత పనితనంపై పలు సదస్సు ల్లో ప్రస్తావించా. గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడర్‌షిప్ ఫోరం 2013లో మెట్రో కు మౌలిక వసతుల ప్రాజెక్టులో ఉత్తమ ఇంజినీరింగ్ అవార్డు ఇచ్చింది.

ఆ మాట చాలా బాధ కలిగించింది

శ్రీధరన్ గొప్ప వ్యక్తి. ఆయననుంచి చాలా నేర్చుకున్నా. ఇప్పటికీ ఆయనంటే అదే గౌరవం. అయితే మన మెట్రో ప్రాజెక్టు తొలినాళ్లలో నాపై ఓసారి ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఢిల్లీ మెట్రో విధానాన్ని నేను వ్యతిరేకించా. ఇక్కడ సరిపోదని వాదించా. దానికి నన్ను ఓ మాట అన్నారు. సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నావు (యు సెల్లింగ్ ఫ్యా మిలీ సిల్వర్) అన్నారు. ఆ మాట ఎంతగానో బాధించింది. అయినా నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం, ముందుకు వెళ్లా.. తర్వాత ఆయనే ఇంజినీరింగ్ వండర్ చేశారని ప్రశంసించారు. ఇప్పుడు చాలా గర్వంగా ఉన్నది. ఇక్కడ ఎలివేటర్ విధానం సక్సెస్ అయింది.

పీపీపీ ఉత్తమమైందని నేనే చెప్పా…

పీపీపీ విధానం అంటేనే తప్పుగా ఆలోచిస్తారు. హెచ్‌ఎంఆర్‌ని పీపీపీ విధానంలో నిర్మించాలని నేను తొలి నుంచి చెప్పా. పీవీ నర్సింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు చాలా గొప్పవి. దాన్ని అనుసరించేందుకు సిద్ధంగా ఉంటా. మన దేశం లో ప్రపంచస్థాయిలో మెట్రో నిర్మించాలం టే ఎంతో డబ్బు అవసరమవుతుంది. అంతపెద్దమొత్తం భరించడం ఏ ప్రభుత్వానికీ సాధ్యపడదు. అందుకే పీపీపీలో మెట్రో నిర్మించాలనుకున్నాం. కేంద్రం, రాష్ట్రం, ఎల్‌అండ్‌టీ పెద్దమొత్తంలో చేసిన పెట్టుబడుల వల్ల మెట్రో పూర్తయింది. ఎలివేటెడ్ విధానంలో కడితేనే భవిష్యత్‌లో హైదరాబాద్ అవసరాలు తీరుతాయి. మిగతా నగరాల్లోలాగా నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని వివరించా.

ప్రచారకర్తగా మారా..

మెట్రో పూర్తి కాదని చాలా మంది అన్నా రు. అయినా వెనక్కి తగ్గలేదు. విమర్శలను పక్కన పెట్టా. పనితీరుతోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నా. మెట్రో రైలు మీద మొత్తం 341 కేసులు వేయగా అందులో 330 కేసులు నెగ్గాం. చైనాలో ఒక పని తలపెడితే ఎవరూ వ్యతిరేకించరు. కానీ మన దేశంలో ఎంతో మంది ఇలాంటి పనులకు అడ్డుగా వస్తారు. వీరందరికీ అవగాహన కల్పించేందుకు ప్రచారకర్తగా మారా. మీడియా సహకారంతో మెట్రో ప్రయోజనాలను వివరించా. స్వతహాగా తెలుగు భాషాభిమాని అయిన నేను మరో కవి బండి సత్తెన్నతో కలిసి మెట్రో గురించి పాటలు, కవితలు రాశా. మెట్రో దారిలో ప్రార్థనా మందిరాల విషయంలో ఆయా వర్గాలవారితో ప్రత్యేక చర్చలు జరిపి పోలీసుల సాయం కూడా లేకుండా సమస్యలు పరిష్కరించుకున్నాం.

ఇప్పుడే గృహప్రవేశం చేశాం

చివరి మూడు నెలలు మా ఇంజినీర్లు రాత్రింబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేశారు. కొన్నిచోట్ల పార్కింగ్ లేదని అంటే ఎలా? ఇల్లు కట్టినా, ఫ్లాట్ కొన్నా ముహూర్తం పెట్టుకొని ఓ రోజు గృహప్రవేశం చేస్తాం. పనులు ఒకవైపు జరుగుతూనే ఉంటాయి. మన మెట్రో కూడా అలాంటిదే. ఇప్పుడే ఇండ్లల్లోకి వెళ్లాం. పనులు ఇంకా జరుగుతుంటాయి. త్వరలో అన్ని వసతులు కల్పిస్తాం. అన్ని రైల్వే స్టేషన్లు, ఎంఎంటీఎస్, బస్టాండ్లను మెట్రోతో అనుసంధానం చేస్తాం. మెట్రో కారిడార్‌లో స్కైవాక్ ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తాం. అత్యాధునిక పార్కిం గ్ స్థలాలు అందుబాటులోకి వస్తాయి.

కేటీఆర్ మంత్రి అయ్యాకే మెట్రోలో వేగం

మున్సిపల్‌శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించాకే మెట్రో ప్రాజెక్టులో వేగం పుంజుకున్నది. ఆయనది ప్రపంచస్థాయి దృష్టి. కలిసిన ప్రతి సారీ ప్రపంచ నగరాలు ఎలా ఉన్నాయో తెలుసు కదా.. మనం కూడా బెస్ట్ హైదరాబాద్‌ని రూపొందించాలి అని అనేవారు. అప్పుడు నేను కొత్త కాన్సెప్ట్ తీసుకువచ్చా. మన మెట్రో సాధారణ ప్రాజెక్టు కాదు. ఇది అర్బన్ రీడిజైన్ ప్రాజెక్టు. మెట్రో ప్రారంభమయ్యాక హైదరాబాద్ కొత్త నగరంలా తయారవుతుంది. మెట్రో స్టేషన్లను అదే విధంగా తీర్చి దిద్దాం. ప్రతి స్టేషన్‌పై రూ.60 కోట్లు ఖర్చు చేశాం. అమీర్‌పేట స్టేషన్ కోసం రూ.215, ఎంజీబీఎస్‌కు రూ.300 కోట్లు ఖర్చు చేశాం. ఒక నెల తర్వాత మీరు కొత్త హైదరాబాద్‌ను చూస్తారు.

మెట్రో ప్రచారంలో భాగంగా ఎన్వీఎస్ రెడ్డి రాసిన పాట..

ఇంధనము ఖర్చు తక్కువ- ఇంజనేమో స్పీడెక్కువ
గూబగుయ్యి మనిపించే -గుండెలదిరె సౌండు రాదు
దుమ్ము ధూళి రేగిపోదు- దగ్గు దమ్ము రానేరాదు
అలిసిపోయే పనిలేదన్నో-మా అన్నల్లారా..
హాయిగ పయనంబు సాగున్నే మా అక్కల్లారా..

రాసిన కవిత..

ఆకాశ వీధుల్లో అనునిత్యం శ్రమిస్తూ
ఆశల సౌధాల్ని నిర్మిస్తున్నాం
గమ్యం చేరడానికి గంటలు పడుతోన్న
రద్దీ రాస్తాల్లో కంబాలు నిలబెట్టి
వయ్యారపు వయాడక్టులు కడుతున్నా
మెరుపు తీగల్లా పరుగెత్తే
మెట్రో రైల్ రహదార్లవి..
సామాన్యుల సౌఖ్యానికి
సాంకేతిక నివాళ్లవి..
గంటల పయనాన్ని నిమిషాలకు మార్చే
మహత్తర యాగం ఈ యత్నం
మన నగర కీర్తి పతాకను
మహోన్నతంగా నిలిపేది మెట్రో..

సీఎం కేసీఆర్ చెప్పిందే నిజమైంది

మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు, నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు విడివిడిగా ప్రారంభించాలని ప్రతిపాదించా. ఎందుకంటే అప్పటికి అమీర్‌పేట మెగా స్టేషన్ సిద్ధం కాలేదు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎండ్ టు ఎండ్ ప్రారంభం చేద్దామని చెప్పారు. అలా అయితేనే ప్రజలు ఎక్కువ ఆదరిస్తారన్నారు. మంత్రి కేటీఆర్, నేను చర్చించుకొని సరే అని ప్రామిస్ చేశాం. అలా తొమ్మిది నెలల్లో చేసే పనిని మా ఇంజినీర్లు కేవలం మూడు నెలల్లో పూర్తి చేశారు. మూడు రోజుల ముందు వరకు అమీర్‌పేట స్టేషన్ ప్రారంభానికి సిద్ధం కాలేదు. అసలు ప్రారంభమవుతుందా లేదా అని భయమేసింది. ప్రారంభోత్సవం నాడు ఉదయం 5 గంటల వరకు పనులు పూర్తి చేసి సిద్ధం చేశాం. మొత్తానికి సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఎండ్ టు ఎండ్ ప్రారంభించడం మంచిదైంది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఆదరిస్తుండడంలో సీఎం సూచన చాలా ఉపయోగపడింది.

TAGS;Metro Rail , Cm Kcr , Nvs Reddy , Trs Government , L&T ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *