కేంద్రం నుంచి పట్టుబట్టి సాధించుకున్న మూడు ఎక్స్‌ప్రెస్ హైవే

కేంద్రం నుంచి పట్టుబట్టి సాధించుకున్న మూడు ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 1700 కిలోమీటర్ల నిడివిగల ప్రతిపాదిత హైదరాబాద్-అమరావతి, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలకు సంబంధించి డీపీఆర్లు తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మూడు ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం జరిగితే సరిహద్దు రాష్ర్టాలతో రవాణా సంబంధాలు మెరుగుపడటంతోపాటు, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేకచొరవతో మూడు ఎక్స్‌ప్రెస్ హైవేలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వాటి నిర్మా ణం త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఇటీవల రోడ్లుభవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సంబంధిత నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండి యా (ఎన్‌హెచ్‌ఏఐ)అధికారులను ఆదేశించారు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం-2014లోని మౌలికసదుపాయాల కల్పనలో భాగంగా హైదరాబాద్- అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేపై డీపీఆర్లను సిద్ధంచేసి కేంద్రానికి పంపించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేల పనులు వేగవంతం చేస్తున్నారు. వీటి ప్రాజెక్టు రిపోర్టులు పూర్తయిన వెంటనే నిధులు మంజూరు చేయించుకుని పనులు ప్రారంభించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి డీపీఆర్ తయారు చేసే కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు పిలిచామని, త్వరలో పనిప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 

భూసేకరణపై కలెక్టర్లతో సమావేశం

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన రహదారులకు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తిచేయించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన అన్నిజిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్ల నిర్మాణంలో భూసేకణ జటిలమైన అంశమని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందని కలెక్టర్లకు ఆదేశాలు జారీఅయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన 2017 నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ జరుపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి నిధులు త్వరగా విడుదలయ్యేలా రాష్ట్ర ఎంపీలు ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో సంప్రదింపులు జరిపిన విషయం విదితమే. కొత్తచట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

TAGS;Government ,Special Focus ,1700 Km Highways ,Hyderabad-Nagpur ,Hyderabad-Bangalore ,CMKCR ,