పక్షి విసర్జనాలతో రోగాలు

 నగరంలోని పావురానికి ఎక్కడలేని బద్దకం వచ్చింది. చక్కగా ఎగురుతూ, చెట్లెంబడి వెళ్తూ తిండిగింజలు తెచ్చుకొని కడుపు నింపుకొనేంత ఓపిక లేకుండా పోయింది. పావురాలు కనిపించినప్పుడు సిటీ కల్చర్ పేరుతోనో.. లేక సరదాగనో మనుషులు తిండి గింజలు వేసే దానగుణం.. పావురాల జీవన విధానాన్ని ఛిద్రం చేస్తున్నది. పురివిప్పాల్సిన రెక్కలు బరువెక్కి కదులటమే మానేశాయి. ఆహారం కోసం అన్వేషణ చేయాల్సిన అవసరం లేకుండానే కండ్లముందు వచ్చి పడుతుండటంతో ఆకాశంలో విహరించాల్సిన విహంగం నేలకు కరుచుకునిపోతున్నది. చెట్లపై ఆవాసముండాల్సిన పక్షి.. ైఫ్లెఓవర్లు, మెట్రో పిల్లర్లు, అపార్ట్‌మెంట్ కిటికీలపై గూళ్లు కట్టుకుంటున్నది. పర్యవసానంగా మేటింగ్ అధికమై పావురాల సంఖ్య ఏయేటికాయేడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. సహజత్వానికి భిన్నంగా జీవిస్తున్న పావురాల వల్ల ఆ జాతికే కాకుండా.. వాటిని ఈ విధంగా పోషిస్తున్న మన సమాజంపైనా ప్రతికూల ప్రభావం పడుతున్నది. రాజేంద్రనగర్‌లోని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం ఈ విషయం స్పష్టం చేస్తున్నది. nppof-love-birds

పల్లెకూ పట్నానికీ అంతులేని తేడా

పల్లెల్లోని పావురాలకు, పట్నంలోని కబూతర్లకు మధ్య అంతులేని తేడా కనిపిస్తున్నది. అచ్చంపేట, మున్ననూర్, జడ్చర్ల ప్రాంతాలకు వెళ్తే అక్కడి రామచిలుకలకు పెద్దపెద్ద చెట్లే ఆవాసాలు. ఉదయం, సాయంత్రం పంట పొలాల్లోకి వెళ్లి తిండిగింజలు తెచ్చుకొని తిరిగిచ్చే దృశ్యాలు మనకు కనువిందు చేస్తాయి. అదే నగరంలోనైతే ఏ పక్షికీ అన్వేషణ అనే గుణం.. పుట్టుకతోనే లేకుండా చేస్తున్నారు. పల్లెల్లోని రామచిలుక, కోయిల, పాలపిట్ట, పిచ్చుకలకు రోజుకు 14-18 గ్రాముల ధాన్యం సరిపోతుంది. అదే పట్నంలోని పావురాలు 20 గ్రాముల వరకు తినేస్తున్నాయి. మనిషికైనా, పశుపక్ష్యాదులకైనా.. ఖాళీగా కూర్చొని తింటే ప్రమాదమే! అంతే కాదు సహజ సంచార లక్షణం ఉన్న పావురం సూక్ష్మజీవులను, చిన్న చిన్న పురుగులను తినేస్తాయి. ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. ఇప్పుడు పావురాలు తిండిగింజలు తప్ప పురుగుల్ని తినే పరిస్థితే లేకుండా పోయింది. వాటికి ఆ అవకాశమే ఇవ్వకుండా మనమే గుప్పిళ్లకొద్దీ తిండిగింజల్ని వేస్తున్నాం. తద్వారా మనమే పర్యావరణానికి హాని తలపెడుతున్నాం. 

483 స్థలాల్లో పావురాల స్థావరాలు

నగరంలో పావురాలు మెట్రో స్తంభాలు, ైఫ్లెఓవర్ల సందులను ఆవాసం చేసుకున్నాయి. కొందరు పక్షి ప్రేమికులు అపార్టుమెంట్లు, ఇండ్ల పైనా పెంచుతున్నారు. నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ఇందిరాపార్క్, ట్యాంక్‌బండ్, బంజారా ఫంక్షన్ హాల్.. కొన్ని షాపింగ్ మాల్స్ ప్రాంతాల్లో ప్రతి రోజూ పావురాలకు గింజలు వేస్తున్నారు. ఒకరికి మించి ఒకరు పోటీ పడి ధాన్యాన్ని చల్లుతూ ఆనందాన్ని పొందుతున్నారు. జంటనగరాల్లోని 483 ప్రాంతాల్లో ఆరు లక్షల పావురాలు ఉన్నట్లు అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం గుర్తించింది. నమ్మండీ.. నమ్మకపొండి.. వీటి కోసం పక్షి ప్రేమికులు చేస్త్తున్న ఖర్చు రూ.17 కోట్ల పైమాటే!!

రోగాల వ్యాప్తికి పావురం

పావురాలు మనుషుల మధ్యనే తిరుగుతుండడం వల్ల, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులకు ఆస్తమా వంటి వ్యాధులు సోకే అవకాశం ఉంది. పావురాల నుంచి ప్రమాదకర వైరస్ మనుషుల్లోకి చేరే అవకాశం లేకపోలేదు. పావురాల రెట్ట పొడిగా మారి గాల్లో కలిసినప్పుడు ముక్కుద్వారా శరీరంలోకి చేరుతుంది. అవి తినే గింజలు శుభ్రంచేసినవి కావు. పొలాల్లో రసాయనాలు ఉపయోగించగా పండించినవే. వాటివల్ల కూడా రోగాలబారిన పడటం ఖాయం. ఈ వ్యాధులు ఒకరినుంచి మరొకరికి విస్తరిస్తాయి కూడా. పక్షులకు బతుకునివ్వాలి. బతకనివ్వాలి. వాటి తిండిని వాటినే వెతుక్కోనివ్వాలి. వేసవిలోనీటి సదుపాయాన్ని కల్పిస్తే చాలు. 

పావురం తిండి కాస్ట్లీ

రోజుకు తినే గింజలు 20 గ్రాములు.. నెలకు: 600 గ్రాములు.. ఏడాదికి: 7.2 కిలోలు
నగరంలోని పక్షుల సంఖ్య(సుమారుగా): 6 లక్షలు
పక్షుల కోసం వినియోగిస్తున్న ధాన్యం: 43,20,000 కిలోలు(43,200 క్వింటాళ్లు)
ఈ ధాన్యం సగటు కిలో ఖరీదు రూ.39.40 (జొన్నలు కిలో: రూ.50..రాగులు కిలో: రూ.42..సజ్జలు కిలో: రూ.26)
ఎక్కువమంది మూడింటిని కలిపే చల్లుతారు. అంటే ఏటా అవుతున్న ఖర్చు రూ.17 కోట్లు
ఈ పక్షుల కేంద్రాల దగ్గరయితే ధాన్యపు ప్యాకెట్లను రెట్టింపు ధరకు విక్రయిస్తారు. 

పండ్ల చెట్లను పెంచాలి

పక్షి అంటే ఎగిరేది. కానీ నగరంలో ఉండే పావురాల రెక్కల శక్తి సన్నగిల్లడానికి కారణం వాటి మానాన వాటిని బతుకనివ్వకపోవటం. వాటి జన్యువుల్లోనే మార్పులొస్తున్నాయి. ప్రేమ పేరుతోనో, మానవత్వం పేరుతోనో తిండిగింజలు వేయడంవల్ల, పావురాల సహజగుణం నాశనమవుతున్నది. వాటికి గింజలు చల్లడం కంటే.. ఇండ్లల్లో పక్షులకు ఆహారం సమకూర్చే చెట్లను అభివృద్ధి చేయండి. 
– డాక్టర్ వీ వాసుదేవరావు, సహ కో-ఆర్డినేటర్,
అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం

పక్షి విసర్జనాలతో రోగాలు

పక్షులు ఉన్న ప్రాంతాల్లో ఉండే వారికి, ఎక్కువగా సంచరించే వారికి దగ్గు, జ్వరం, ఆయాసం వంటివి వస్తాయి. ఆ తర్వాత అది హైపర్ సెన్సిటివ్ హ్యుమనిటీస్‌గా మారుతుంది. అది గుర్తించకుండా సాధారణ చికిత్స చేయించుకుంటే ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. పక్షుల విసర్జన ద్వారా తలెత్తిన అనారోగ్యంగా దీనిని గుర్తించి అవసరమైన వైద్యచికిత్సను అందించాలి. బర్డ్ ప్రొటీన్ ద్వారా తలెత్తే వ్యాధులను సరైన చికిత్స చేయించుకోకపోతే క్రానిక్‌గా మారుతాయి. పరిసరాలను తగిన విధంగా మార్చుకోవాలి.
– డాక్టర్ ప్రమోద్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పల్మనాలజిస్టు, గాంధీ హాస్పిటల్

TAGS;Pigeons Nests  , Metro Pillars  , Apartment  ,Pigeons  ,Droppings Pigeons  ,Sick Man  ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *