ఆడపిల్లలు చాలా తక్కువగా మాట్లాడాలి…

ఆడపిల్లలు చాలా తక్కువగా మాట్లాడాలి…chinanpp ఇంట్లోనే వీలైనంత ఎక్కువగా పనిచేయాలి.. సాధ్యమైనంత వరకు నోరు మూసుకునే ఉండాలి..

సమాజంలో ఉన్నత స్థితికి ఎదిగేందుకు ఏమాత్రం ప్రయత్నించవద్దు.. అణిగిమణిగి నడుచుకోవాలి! … ఇవన్నీ ఏదో మతానికి చెందిన పెద్దలో, ఇంట్లోని ముసలమ్మలో చెబుతున్న మాటలు కావు! చైనాలోని పాఠశాలల్లో టీచర్లు బోధిస్తున్న పాఠాలు! వివరాల్లోకెళ్తే..

ఆధునిక టెక్నాలజీకి చైనాను చిరునామాగా చెబుతారు. సాంకేతికంగా హద్దులే లేకుండా దూసుకుపోతున్న ఆ దేశంలో.. రాతియుగం నాటి ఆలోచనలు ఇంకా ఉనికిని చాటుతూనే ఉన్నాయి. అవి మారుమూల గ్రామాల్లోనో.., మతాలకు చెందిన ఆశ్రమాల్లోనో ఇలాంటి సంకుచిత ఆలోచనలు ఇంకా ఉన్నాయంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే పాఠశాలల్లోనే, విద్యాబుద్ధులు నేర్పే గురువులే సంకుచిత ఆలోచనలను విద్యార్థులపై రుద్దుతున్నారంటే కచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. అందుకే చైనా జనావళి ఇప్పుడు టీచర్లపై భగ్గుమంటోంది. అసలేం జరిగిందంటే

నైతికత పేరుతో..
చైనాలోని పాఠశాలల్లో ‘ఫీమేల్‌ మొరాలిటీ’ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహించడం సంప్రదాయం గా వస్తోంది. తమ దేశానికి చెందిన సంస్కృతి, సం ప్రదాయాల గురించి నేటితరం పిల్లలకు తెలియజెప్పేందుకు, నైతిక విలువలను పెంపొందించేందుకు పాఠశాలల్లో ఈ తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో బోధిస్తున్న విషయాలపైనే దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  

వీడియో కలకలం..
‘ఫీమేల్‌ మొరాలిటీ’ తరగతుల్లో గురువులు బోధిస్తున్న అంశాలు ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావాలన్న సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అందుకు రుజువుగా చైనా వ్యాప్తంగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఆడపిల్లలు నోర్మూసుకొని పడి ఉండాలని, ఎక్కువగా మా ట్లాడవద్దని, ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు ప్రయత్నించవద్దని ఓ టీచర్‌ చెబుతుండగా మరో టీచర్‌.. ‘మీరు ఆహారం కోసం ఎక్కడైనా ఆర్డర్‌ చేస్తున్నారంటే మహిళల కోసం మనం రూపొందించుకున్న నియమాలను మనమే ఉల్లంఘించుకున్నట్లు. ఎందుకంటే  మనం వంట చేసే బాధ్యత మనదే. అలాంటి మనం ఆర్డర్‌ ఇవ్వకూడదంటూ చెబుతోంది.

2011 నుంచి తరగతులు..
ఫుషున్‌ ట్రెడిషనల్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ 2011 సంవత్సరం నుంచి ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఆడపిల్లలకు నైతిక విలువల పేరుతో నిర్వహిస్తున్న ఈ తరగతులు.. బాలికలను నిర్వీర్యం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నా.. జిన్‌ పింగ్‌ ప్రభుత్వం మాత్రం కొనసాగిస్తూనే వచ్చింది.  

ఎట్టకేలకు తగ్గిన సర్కార్‌..
ప్రజల నుంచి వ్యతిరేకత ఒక్కసారిగా పెరగడంతో చేసేది లేక ఈ ప్రత్యేక తరగతులను నిలిపివేశారు. ఇక నుంచి దేశంలోని ఏ పాఠశాలలో ఈ తరగతులు కొనసాగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. 

Tags: Morality tales china schools