కన్నీళ్లు లేకుంటే…

ఒకవైపు పుట్టుకతోనే వచ్చే కంటిజబ్బులు.. మరోవైపు పెరిగితే గానీ బయటపడని నేత్ర సమస్యలు.. ఇలా రెండు వైపుల చిన్నారుల కళ్లు మసకబారుతున్నాయి. శుక్లాలంటే వృద్ధుల్లో మాత్రమే కనిపించే కంటి సమస్యనుకుంటాం. కానీ పుట్టుకతోనే కూడా శుక్లాలుండొచ్చు. ఇలాంటప్పుడు ఏమాత్రం అశ్రద్ధ తగదు. అదేవిధంగా గ్లకోమా కూడా పసిపిల్లల్లోనే రావొచ్చు. కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా చిన్ని కళ్లల్లో సమస్యలు తీసుకొచ్చి, చూపుకి ఎసరు పెట్టొచ్చు. అందుకే పుట్టిన క్షణం నుంచి ప్రతీ సంవత్సరం పిల్లలకు కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని మూకుమ్మడిగా నొక్కి చెప్పారు ఈ సదస్సులో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ నేత్ర వైద్య నిపుణులు. gray1205npp

కన్నీళ్లు లేకుంటే…

మనం ఏడ్చినప్పుడో, నవ్వినప్పుడో మాత్రమే కళ్లలో నీళ్లు ఉబికి, కన్నీళ్లు వస్తాయనుకుంటాం. కానీ కళ్లలో నీరు ఎప్పుడూ ఉంటుంది. కనుగుడ్డు మార్జిన్‌లో అంటే కను కొలకుల దగ్గర అశ్రుగ్రంథులనే నూనె గ్రంథులు ఉంటాయి. ఇవి అశ్రువులను అంటే కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయి. ఎప్పటికప్పుడు ఇవి ఆవిరైపోతుంటాయి. నీటి ఉత్పత్తి, అవి ఆవిరవడం.. ఈ రెండు ప్రక్రియలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ నీళ్లు ఎక్కువగా ఆవిరైపోతుంటాయి. తద్వారా కంటిలో నీరు తగ్గిపోయి పొడిబారుతాయి. డ్రై ఐస్ సమస్యకు ఇది సాధారణమైన కారణం. ఇకపోతే కొందరిలో అశ్రుగ్రంథులే తగినన్ని కన్నీళ్లను ఉత్పత్తి చేయలేవు. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులున్నవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 20 ఏళ్ల వయసు వచ్చేవరకు దాదాపుగా ఈ సమస్య బయటపడదు. పొడిబారే కళ్లను సకాలంలో కనుక్కోలేకపోతే క్రమంగా చూపు తగ్గిపోతుంది. కంటి పరీక్షలో మాత్రమే ఇది బయటపడుతుందంటున్నారు పిట్స్‌బర్గ్ యుపిఎంసి చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి చెందిన ప్రొఫెసర్ కెన్ నిశ్చల్. కళ్లు పొడిబారే సమస్యకు (డై ఐస్) చుక్కల మందే చికిత్సగా ఉండేది. ఇప్పుడు ప్లంక్టల్ ప్లగ్స్ వేస్తున్నాము. అంటే కనుగుడ్డు మార్జిన్ దగ్గరున్న చిన్న రంధ్రాన్ని సిలికాన్ ప్లగ్‌తో బ్లాక్ చేస్తామని చెప్పారు కెన్ నిశ్చల్. పిల్లల్లో చేసే కార్నియా మార్పిడి చికిత్సలో కూడా ఇప్పుడు ఆధునిక మందులు వచ్చాయంటున్నారాయన. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇమ్యునో సప్రెషన్ మందుల వల్ల ఈ దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్నారులకు కార్నియా మార్పిడి ఇప్పుడు పెద్ద సమస్యే కాదని సూచిస్తున్నారాయన. 

కచ్చితమైన ఫలితాల టోమోగ్రఫీ!

సకాలంలో చికిత్స అందించాలంటే తొందరగా జబ్బును కనుక్కోవడం కీలకమైన అంశం. జబ్బును కచ్చితంగా గుర్తించాలంటే కచ్చితమైన ఫలితాలను ఇవ్వగలిగే డయాగ్నస్టిక్ సాధనాలుండాలి. కంటి వ్యాధుల నిర్ధారణలో కూడా ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ ప్రధానమైనది. కంటిలో శుక్లాలు, గ్లకోమా లాంటి సమస్యలను కూలంకషంగా పరిశీలించడానికి ఆంటీరియర్ సెగ్మెంట్ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కంటిలో ఉండే ప్రతిబింబ నిర్మాణాల దూరాన్ని కనుక్కోవడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా నాన్ ఇన్వేసివ్ టెక్నిక్ అంటున్నారు పిట్స్‌బర్గ్‌లోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కి చెందిన డాక్టర్ మాథ్యూ పిల్‌బ్లాడ్. కంటిలో ఆంటీరియర్ భాగంలోని విభాగాలకు సంబంధించిన నిర్మాణాలను లోతుగా తెలుసుకోవడం ఈ టోమోగ్రఫీతో సుసాధ్యం. శుక్లాలు, దృష్టి లోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్), గ్లకోమా వంటి సమస్యల గురించి తెలుసుకోవడానికి ఇది అధునాతన పద్ధతి. ఆంటీరియర్ సెగ్మెంట్ ప్రత్యేకించి కార్నియా, ఐరిస్, ఆంటీరియర్ చాంబర్ కోణం విలువలను ఇది చాలా కచ్చితంగా చెప్తుంది. రిఫ్రాక్టివ్ సర్జరీ అయినవాళ్లకు, కార్నియా మందం తక్కువగా ఉండి, ఏమైనా సమస్యలున్నవాళ్లలో కూడా కళ్లను పరీక్షించడం సులభతరం చేస్తుంది. 

మెల్లకన్ను.. అశ్రద్ధ వద్దు!

మెల్లకన్ను విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ వి.వి. రావు. మనం ఒకే దృశ్యాన్ని రెండు కళ్లతో 3 డైమెన్షనల్‌గా చూడగలుగుతాం. దీన్నే బైనాక్యులర్ విజన్ అంటారు. ఈ బైనాక్యులర్ విజన్ మనకు తప్ప ఏ జీవికీ ఉండదు. దురదృష్టవశాత్తు చిన్న పిల్లల్లో మెల్లకన్నును గుర్తించకపోవడం వల్ల ఈ బైనాక్యులర్ విజన్ సామర్థ్యాన్ని కోల్పోతున్న వాళ్లు చాలామంది ఉంటున్నారంటున్నారాయన. బిడ్డ పుట్టిన 6 నెలల వయసులోపే బైనాక్యులర్ విజన్ అభివృద్ధి చెందుతుంది. ఒకసారి బైనాక్యులర్ విజన్ డెవలప్ అయ్యే వయసు దాటిందంటే ఇక మెల్ల సరిచేసినప్పటికీ బైనాక్యులర్ విజన్ రాదు. అందుకే బిడ్డ పుట్టగానే కంటి పరీక్ష చేయించడం తప్పనిసరి. ఇలా పరీక్షలో మాత్రమే ఇది అసలైన మెల్లనా కాదా అనేది తెలుస్తుంది. సూడో స్కింట్ అయితే చికిత్స అవసరం లేదని సూచిస్తున్నారు. 

లాభనష్టాలు..

కన్ను పరిమాణం అంటే కన్ను లోపల ఉండే ఆంటీరియో పోస్టీరియర్ డయామీటర్ (ఏక్జియల్ లెంగ్త్) తక్కువగా ఉన్నవాళ్లలో హైపర్‌మెట్రోపియా దృష్టిలోపం వచ్చే అవకాశం ఎక్కువ. అయితే పిల్లలు పెద్దవుతూ కంటి పరిమాణం పెరుగుతున్న కొద్దీ దృష్టిలోపం తగ్గిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే కళ్లద్దాలు పెట్టుకుంటే కొన్నాళ్లకు లోపం తగ్గిపోతుంది. అయితే మయోపియాలో (మైనస్ పవర్) అలా కాదు. కంటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు మయోపియా అవకాశం ఎక్కువ. ఈ పరిమాణం తక్కువ కాదు కాబట్టి వయసు పెరుగుతున్నప్పటికీ దృష్టిలోపంలో తేడా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్లస్ పవర్ (హైపర్‌మెట్రోపియా) ఎక్కువగా ఉంటే మయోపియా అవకాశం తగ్గుతుందన్నమాట. కాని మెల్ల వచ్చే అవకాశం మాత్రం ఎక్కువ. 

మెల్ల.. కళ్లద్దాలతో సరి!

మెల్ల కన్ను ఉన్నప్పుడు మెదడుకు గందరగోళం ఏర్పడుతుంది. అందువల్ల అది కేవలం ఒక కన్ను నుంచి మాత్రమే చూస్తుంది. అలా రెండో కన్ను నిరుపయోగంగా మారుతుంది. ఉపయోగంలో లేకపోయేసరికి అది క్రమంగా చూడగలిగే శక్తి కోల్పోతుంది. దీన్నే లేజీ ఐ అంటారు. ఏడాది వయసు నుంచి 13 ఏళ్ల లోపు కన్ను లేజీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోపే చికి త్స ఇవ్వాలి. మెల్లకు అద్దాలు, సర్జరీ రెండు రకాల చికిత్సలు. మెల్ల ఉన్నవారిలో 50 శాతం మందిలో ఒక కన్ను చూపు తగ్గిపోతుంది. హైపర్‌మెట్రోపియా వల్ల మెల్ల వచ్చినవాళ్లకు కళ్లద్దాలు ఇస్తే క్రమంగా మెల్ల తగ్గిపోతుంది. వయసు దాటిపోయినా, మరే ఇతర సమస్య వల్ల మెల్ల వచ్చినా సర్జరీ అవసరం అవుతుంది. లేజీ ఐ ఉన్నవారికి ముందు లేజీగా మారిన కన్నునుఉ ప్యాచింగ్ థెరపీ ద్వారా సరిచేసి, ఆ తర్వాత మెల్ల కూడా సరిచేస్తారు. దీని ద్వారా దృష్టి బాగా ఉన్న కన్నును ప్యాచ్ ద్వారా మూసేసి, తక్కువ ఉన్న (లేజీ) కన్నును ఎక్కువగా వాడుతారు. ఒకరకంగా ఆ కన్నుకిది ఎక్సర్‌సైజ్ వంటిది. దీనివల్ల క్రమంగా లేజీ తగ్గుతుంది. 

గ్లకోమాకు రెటీనా పల్స్ టెస్ట్..

పిల్లల్లో శుక్లాలు ఏర్పడితే వీలైనంత తొందరగా తీసేయాలి. లేకుంటే చూపు దెబ్బతింటుంది. అందుకే పుట్టిన వారంలోపే శుక్లాన్ని తప్పనిసరిగా తీసేయాలి. శుక్లం వల్ల కూడా మెల్ల కన్ను, దానిద్వారా చూపు మరింత దెబ్బతినడం జరుగుతుంది. ఇలాంటప్పుడు మెదడు నిర్మాణంలో కూడా మార్పులు వస్తాయంటున్నారు ప్యారిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ విస్కన్ అసోసియేట్ ప్రొఫెసర్ కామెరూన్ పార్సా. అందుకే శుక్లాలను కనుక్కుని పదేళ్లలోపు చికిత్స ఇవ్వాలి. ఇకపోతే చిన్నారుల్లో చూపు దెబ్బతీసే జబ్బుల్లో గ్లకోమా కూడా ముఖ్యమైనదే. కంటిలో ఉండే పీడనం పెరిగితే అది గ్లకోమాగా కనిపిస్తుంది. మెదడులో ఉండే ద్రవంలో కూడా కొంత పీడనం ఉంటుంది. కన్నులో ఉండే పీడనం మెదడులోని పీడనం కన్నా తక్కువగా ఉండాలి. ఇదెలా ఉందో తెలుసుకోవాలంటే కంటి పరీక్ష చేయించుకోవాల్సిందే. ఈ పరీక్షలో రెటినాలోని రక్తనాళాన్ని పరీక్షిస్తారు. ఈ రెటీనా రక్తనాళంలో పల్స్ తెలుస్తుంది. పల్స్ ఎక్కువగా లేదంటే కన్నులోని పీడనం కన్నా మెదడులోని పీడనం ఎక్కువగా ఉందని అర్థం. ఒకవేళ పల్స్ ఉంటేమాత్రం కన్నులో పీడనం ఎక్కువగా ఉండి, గ్లకోమా ఉందని గుర్తించాలంటున్నారు ప్రొఫెసర్ కామెరూన్. 

కొత్త బయోమార్కర్.. డోపమైన్

పిల్లల్లో అతి సాధారణంగా కనిపించే దృష్టిలోపం మయోపియా. ఈ సమస్యను గుర్తించడానికి, చికిత్స కోసం ఒక బయోమార్కర్‌ను కనుక్కున్నారు. అదే డోపమైన్. డోపమైన్ అనేది రెటీనాకు సంబంధించిన ఒక న్యూరో ట్రాన్స్‌మిటర్. దృష్టి వ్యవస్థలో సంకేతాల సమాచార ప్రసారంలో ఇది ముఖ్యపాత్ర వహిస్తుంది. జంతువుల్లో చేసిన పరిశోధనలు పిల్లల్లో నేత్రాల ఎదుగుదల నియంత్రణలో డోపమైన్ పాత్ర ఉంటుందని తేలింది. డోపమైన్‌లో తేడాలుంటే చిన్నారుల్లో మయోపియా బయోమార్కర్‌గా గుర్తించవచ్చు. డోపమైన్‌ను మయోపియా నివారణలో వాడవచ్చని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయని చెప్పారు బెంగుళూరులోని నారాయణ నేత్రాలయకు చెందిన డాక్టర్ జ్యోతి మటాలియా. కుందేళ్లు, గినియా పందుల్లో చేసిన ఎల్-డోపా పరిశోధనలు ఈ విషయంలో కొత్త ఆశలు కలిగిస్తున్నాయన్నారామె. డోపమైన్ ఇంజెక్షన్లు ఇస్తే కుందేళ్లలో మయోపియా వచ్చే అవకాశం తగ్గింది. గినియా పందుల్లో కూడా ఎల్-డోపా ఇంజెక్షన్ల ద్వారా మయోపియా వల్ల చూపు తగ్గడాన్ని నివారించగలిగారు. అందుకే ఈ పరిశోధనలు మనుషుల్లో కూడా మయోపియా చికిత్సలో కీలక పాత్ర వహిస్తున్నాయి. అయితే దీనివల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలను తగ్గించి, మయోపియా చికిత్సలో ఉపయోగపడేలా పరిశోధనలు ముమ్మరమయ్యాయి.

-చిన్నారుల్లో చూపు దెబ్బతినడానికి ప్రధాన కారణం మెల్ల కన్ను. 
-ఒకటే కన్నులో మెల్ల కనిపిస్తున్నదంటే ఒక కన్నులో చూపు తగ్గినట్టే అనుకోవాలి. 
-3-5% మందిలో ఈ సమస్య ఉంటున్నది. 
-ఏదైనా యాక్సిడెంట్లు, గాయాలైనప్పుడు కూడా మెల్ల ఏర్పడవచ్చు. కాకపోతే దీనికి సర్జరీ అవసరం అవుతుంది. దీన్ని అక్వైర్డ్ స్కింట్ అంటారు. ఇది డయాబెటిస్, బిపి వల్ల కూడా మెల్ల రావొచ్చు. 
-పిల్లల్లో పుట్టుకతో వచ్చే శుక్లాలు కూడా మెల్లకు కారణం. వీటివల్ల చూపు మసకబారుతుంది. కాంతి తక్కువగా వెళ్తుంది. పూర్తి కాటరాక్ట్ ఉంటే అసలు వెళ్లదు. దీనివల్ల వచ్చే మెల్లను డిప్రివేషనల్ అంబ్లియోపియా అంటారు.
-ఒక కన్నులో రిఫ్రాక్టివ్ ఎర్రర్ (దృష్టి లోపం) ఉంటే వచ్చే మెల్లను అనైసో మెట్రోపిక్ అంబ్లియోపియా అంటారు. 
-కంజెనిటల్ ఈసోట్రోపియా (క్రాస్డ్ ఐస్) – మెల్ల ముక్కు వైపు ఉంటుంది. ఇంతకుముందు పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఇండియాలో కూడా పెరుగుతున్నది. దీనివల్ల 50 శాతం చూపు తగ్గుతుంది.
-తొందరగా పసిగట్టి పదేళ్లలోపు చికిత్స చేస్తే తగ్గిన చూపును రివర్స్ చేయవచ్చు. సాధారణంగా ఏడాది వయసు లోపే గుర్తించి, చికిత్స చేయిస్తే మంచిది. 
-అందుకే మొదటి సంవత్సరం లోపు తప్పనిసరిగా చేయించాలి. ఆ తరువాత మూడునాలుగేళ్లకు, ఆ తర్వాత ప్రతి ఏటా చేయించాలి. 
-సమస్య ఏదైనా ఉంటే ప్రతి మూడునాలుగు నెలలకు ఫాలోఅప్ చేయించాలి. చిన్న పిల్లల్లో అస్సలు ఆలస్యం చేయొద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *