బ్లూటూత్, హెడ్‌ఫోన్స్ ఆన్‌లో ఉంటే కేసే

సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిసినా వాహనదారులు మారడం లేదు. డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలకు కారణం అవుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నా పట్టించుకోవడం లేదు. మీ ఒక్కరినే కాదు వెనుకాల వస్తున్న వారినీ ప్రమాదంలో నెడుతున్నారని మొత్తుకుంటున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిసినా.. కేసులు రాస్తున్నా నేరాలు తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గత పది నెలల్లోనే 9,545 మంది సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. అంటే ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 9,545 మంది రూల్స్‌ను ఉల్లంఘించారన్నమాట. ఈ కేసుల్లో దొరికినవారందరికీ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన ఉన్నదని.. అయినా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బండ్లు నడుపుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇలా వందలాది మంది రోడ్ల మీద బైక్‌లు, కార్లు, ఆటోలను ఇష్టం వచ్చినట్టు నడిపుతుండడం వల్లే ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని చెప్తున్నారు. traffic-rules-npp

బ్లూటూత్, హెడ్‌ఫోన్స్ ఆన్‌లో ఉంటే కేసే

చాలా మంది వాహనదారులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బ్లూటూత్‌లు, ఇయర్ ఫోన్స్ వాడుతున్నారని, కార్లలో బ్లూటూత్ కనెక్షన్లను పెట్టుకొని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. కొందరు వాహనదారులు ఏకంగా సెల్‌ఫోన్‌ను హెల్మెట్‌లో దూర్చుకొనిడ్రైవింగ్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యం లో హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ ఆన్‌లో ఉన్నా, హెల్మెట్‌లో సెల్‌ఫోన్‌ను దూర్చి మాట్లాడుతూ వాహనాలు నడిపేవారిపైనా సెల్‌డ్రైవింగ్ కేసులు నమోదు చేయనున్నారు. మొత్తంగా మూడుసార్లకు మించి సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయనున్నారు. 

తీవ్రంగా పరిగణిస్తున్నాం
సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నాం. మూడు సార్లకు మించి పట్టుబడితే వారి లైసెన్స్ రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేస్తాం. గత పది నెలల్లో 9,545 కేసులు నమోదు చేశాం. 3,617 కేసుల్లో రూ.37.39 లక్షల జరిమానా వసూలు చేశాం. మిగతా చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు అత్యవసర కాల్స్ వస్తే వాహనాన్ని పక్కకు తీసుకొని మాట్లాడండి. సెల్‌డ్రైవింగ్‌తో మీ ప్రాణాల మీదికి తెచ్చుకోవడంతోపాటు, ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు. 
TAGS; Rachakonda Police , Cellphone Driving , Divyacharan Rao 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *