రాజకీయ వారసుడు.. పెరిగిన దూకుడు…

ఎట్టకేలకు కాంగ్రెస్‌ పగ్గాలను రాహుల్‌గాంధీ చేపట్టడానికి రంగం సిద్ధమవుతోంది. అయిదేళ్ల క్రితం జయపురలో జరిగిన సమావేశంలో ‘అధికారమంటే విషం సుమా’ అని చెబుతూనే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆయనకు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. భావోద్వేగం నడుమ ఆ బాధ్యతలు చేపట్టిన యువనేత ఇప్పుడా విష పాత్రను తీసుకునేందుకు సిద్ధపడాల్సి రావడం విశేషం..! ఇంతకాలం తల్లి నిర్వర్తించిన బాధ్యతల్ని వచ్చేవారం తనయుడు చేపట్టబోతున్నారు. పెద్ద బాధ్యతల్ని తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో రాహుల్‌ను గతంలో పప్పూ అంటూ విమర్శకులు ఎద్దేవా చేస్తూ వచ్చారు.

నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఆరో వ్యక్తి
మోతీలాల్‌ నెహ్రూ మొదలుకొని కాంగ్రెస్‌ పగ్గాలను చేపట్టిన గాంధీ-నెహ్రూ వంశస్థుల్లో రాహుల్‌ ఆరోవ్యక్తి అవుతారు. అదే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు చొప్పున పార్టీ సారథ్య బాధ్యతల్ని నిర్వహిస్తున్నందువల్ల ఆ పదవిని యువనేత చేపట్టబోవడం ఆశ్చర్యపరిచే పరిణామమైతే కాదు. దిల్లీ, ఫ్లోరిడా, కేంబ్రిడ్జిలలో రాహుల్‌ చదువుకున్నారు. లండన్‌లో మూడేళ్లపాటు పనిచేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక రాజకీయాలపై దృష్టి సారించారు. 2004లో మొదటిసారిగా అమేథీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజకీయ పదకేళిలో పైకి వచ్చేందుకు మొదటి నుంచీ ఆయన కొంత తటపటాయింపు ధోరణినే కనపరుస్తూ వచ్చారు. మధ్యమధ్యలో రైతుల సమస్యలు వంటి అంశాలను తీసుకున్నా, విరామం కోసమంటూ అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లిపోవడం ద్వారా విమర్శల్ని ఎదుర్కొన్నారు. 2015లో ఏకంగా 56 రోజులు ప్రవాసంలో గడిపారు. జూన్‌లో వచ్చే తన పుట్టినరోజు సమయంలో, మళ్లీ ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా కూడా ఆయన పర్యటనలకు వెళ్తూ ఉంటారు.

రాష్ట్రాల ఎన్నికలే తొలి పరీక్ష
గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభల ఎన్నికల ఫలితాలు రాహుల్‌కు తొలిపరీక్ష కానున్నాయి. ఈ ఈ నెల 18న వెలువడనున్న ఫలితాలపై ఆయన మునుపటికంటే ఎక్కువ విశ్వాసంతోనే ఉన్నారు. గుజరాత్‌లో విజయం సాధించినా, కనీసం చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు తెచ్చుకోగలిగినా పార్టీపై ఆయన ముద్ర గట్టిగానే పడనుంది. ఆయన ఉపాధ్యక్షుడయ్యాక జరిగిన ఎన్నికల్లో ఎక్కడా పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం పంజాబ్‌, పుదుచ్చేరి, మేఘాలయా, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. మునుపటితో పోలిస్తే రాహుల్‌ ఇప్పుడు చొరవగా కనిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దూకుడు పెంచారు. తరచూ ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్నారు. తాను శివభక్తుడినని చెప్పుకొంటున్నారు. కాంగ్రెస్‌ అంటే మైనార్టీలకు అనుకూల పార్టీ అనే ముద్రను కొంత సరిచేసే ప్రయత్నంలో పడ్డారు. రాహుల్‌ మాటల్ని భాజపా తీవ్రంగానే తీసుకొంటోంది.

బరిలో ఒకరే
కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీలోఉన్న ఏకైక వ్యక్తి రాహులేనని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ముళ్లపల్లి రామచంద్రన్‌ మంగళవారం వెల్లడించారు. రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ 89సెట్ల నామినేషన్లు వచ్చాయని.. అవన్నీ చెల్లుబాటయ్యేవేనని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 11 చివరి తేదీ కావడంతో అధ్యక్షుడిగా రాహుల్‌ ఎన్నికను అదేరోజు లాంఛనప్రాయంగా ప్రకటించే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *