గతం చెప్పుకుంటే బలం పెరుగుతుందా

గడిచిపోయిన కాలం తిరిగిరాదు కాబట్టి గతాన్ని తలచుకొని సమయం వృథా చేసుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది కనుక దాన్ని వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచించాలంటారు. ఇలాంటి ప్రవచనాలు సామాన్య జనాలకు పనికొస్తాయేమోగాని, రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండదు. వారికి భవిష్యత్తు ఎంత ముఖ్యమో గతమూ అంతే ప్రధానం. ఆంధ్రాలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడికి అక్కడ భవిష్యత్తు ఎంత ముఖ్యమో, తెలంగాణలో గతమూ అంతే ముఖ్యం. అదేంటి? ఆ రాష్ట్రంలో భవిష్యత్తు అక్కర్లేదా? అనే సందేహం కలగొచ్చు. అవసరమే..కాని ఆ భవిష్యత్తు కావాలంటే గతం గురించి బాగా ప్రచారం చేయాలి.4

అంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించిన విజయాలను, ప్రజల కోసం చేసిన మంచి పనులను, అభివృద్ధిని తద్వారా వచ్చిన కీర్తిని, ఘనతను..ఇదంతా భారీగా ప్రచారం చేయాలి. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కాబట్టి జనవరి నుంచే ప్రచార రంగంలోకి దిగిపోవాలని అధినేత టీఎస్‌ టీడీపీ నాయకులను ఆదేశించారు. తెలంగాణ బాధ్యతలూ తానే మీదేసుకొని దిశానిర్దేశం చేస్తున్నారు. ఆంధ్రాలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ అనే కార్యక్రమం చేసిన బాబు, ఇలాంటిదే ‘పల్లెపల్లెకూ తెలుగుదేశం’ పేరుతో తెలంగాణలో జనవరి 18నుంచి 70రోజులపాటు చేయాలని చెప్పారు. 2004లో ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చి వైఎస్‌ఆర్‌ సీఎం అయ్యారు. 2009లో ఆయనే అధికారంలోకి వచ్చినా విధి ఆయన్ని బలిగొంది.

రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి పాలనలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, రాష్ట్ర విభజన జరిగిపోవడం తెలిసిన చరిత్రే. తొమ్మిదేళ్లకు కొద్దిగా తక్కువగా అధికారంలో ఉన్న బాబుకు విభజన పుణ్యమా అని అవశేష ఆంధ్రాలో అధికారం దక్కింది. ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టి అధికారంలోకి వచ్చాక తెలంగాణలో రాజకీయ చైతన్యం పెరిగింది. బడుగుబలహీన వర్గాలవారికి రాజకీయంగా ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కొన్ని ప్రజాకర్షక పథకాలు విజయవంతమయ్యాయి. చంద్రబాబు పాలనలో మిగతా తెలంగాణ విషయం ఎలా ఉన్నా హైదరాబాదులో అభివృద్ధి జరిగింది. ప్రధానంగా ఐటీ రంగం డెవెలప్‌ అయింది. హైటెక్‌ సిటీ నిర్మాణం జరగడంతో అనేకమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆయన పాలనలో ఇదో మైలు రాయని చెప్పుకోవచ్చు.

తన పాలనలో జరిగిన ఇలాంటి అనేక పనుల గురించి తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలని, తద్వారా మళ్లీ టీడీపీ పాలన రావాలనే భావన వారిలో కలిగించాలని బాబు కోరుతున్నారు. హైటెక్‌ సిటీ, శంషాబాద్‌ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైలు…ఇలాంటివన్నీ చంద్రబాబు వల్లనే సాధ్యమయ్యాయని ప్రచారం చేయాలని ఆయన తెలంగాణ నాయకులను ఆదేశించారు. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్‌ను పూర్తిగా తానే అభివృద్ధి చేశానని, అప్పటి అభివృద్ధి ఫలాలే ప్రస్తుతం అనుభవిస్తున్నారని జనానికి వివరించాలని చెప్పారు. బాబు పాలన ముగిశాక తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాదులో అభివృద్ధి ఆగిపోయిందని ఊదరగొట్టాలనేది బాబు ఉద్దేశం.

‘మనం ఆనాడు వేసిన రోడ్ల మీదనే ఇవాంక ట్రంప్‌ నడిచింది’ అన్నారు చంద్రబాబు. తన గత వైభవాన్ని జనాలకు గుర్తు చేస్తే టీడీపీ బలం పెరుగుతుందని, జనం ఆదరించి ఓట్లు వేస్తారని చంద్రబాబు ఆశపడుతున్నారు. ఆయన ఆశ ఎంతవరకు నెరవేరుతుందో టీడీపీ నాయకులకూ తెలియదు. ‘ఉమ్మడి’లో టీడీపీ పాలన ముగిసేనాటికి, ఇప్పటికీ మధ్య అనేక మార్పులొచ్చాయి. కొత్త ఓటర్లు వచ్చారు. తెలంగాణ సెంటిమెంట్‌ గూడుకట్టుకున్నవారు అనేకమంది ఉన్నారు. టీడీపీ నాయకులు చెప్పేదంతా వారి తలకెక్కుతుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *