పవన్‌ పిలుస్తున్నాడు.. వెళ్ళమ్మా అఖిలప్రియా.!

దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్నట్టు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, కృష్ణా నదిలో బోటు ప్రమాదం కారణంగా మృతిచెందినవారి కుటుంబాల్ని తాపీగా ఇప్పుడు పరామర్శించాడు. ‘ఆ సమయంలో విదేశాల్లో వుండబట్టి రాలేకపోయాను..’ అంటూ బాధిత కుటుంబాల్ని ఉద్దేశించి పవన్‌కళ్యాణ్‌ ‘వివరణ’ ఇచ్చుకున్నాడండోయ్‌.! pawan_akhilapriyanpp

‘ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు తగదు. రాజకీయాలు చేయడానికి నేను రాలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఆ బాధ్యత ప్రభుత్వాల మీదే వుంది..’ అంటూ పరమ రొటీన్‌ స్పీచ్‌ ఇచ్చాడు పవన్‌కళ్యాణ్‌. ఆయన నుంచి కొత్తగా ఏమైనా ప్రసంగాలు వస్తాయని ఊహిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. మంత్రి భూమా అఖిలప్రియ, బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తే, వారి ఆవేదన ఏంటో ప్రభుత్వానికి అర్థమవుతుందన్నారు పవన్‌కళ్యాణ్‌. ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, చేతులు దులుపుకోవడం తగదనీ ప్రభుత్వంపై చిన్నపాటి సెటైర్‌ కూడా పవణ్‌ వేశాడండోయ్‌.! 

అయినా, ఇక్కడ రాజకీయం చేయడానికి ఏముంటుందట.? ఘోరం జరిగిపోయింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిబంధనల్ని తుంగలో తొక్కేసిన కొందరు అక్రమార్కులు, 22 మంది ప్రాణాల్ని తీసేశారు. ఇక్కడ మేటర్‌ క్లియర్‌. పర్యాటక శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వమూ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిన ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించి మొదటి తప్పిదం ప్రభుత్వం నుంచే జరిగినట్లు లెక్క. 

ఇంకా నయ్యం, పవన్‌కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని విమర్శించేస్తాడా.? అంత ఛాన్స్‌ ఎక్కడిది.! విశాఖ వెళ్ళాడు పవన్‌ మూడు రోజుల క్రితమే. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణపై గళం విప్పాడు.. ఆ వెంటనే, చంద్రబాబు అక్కడికి వెళ్ళి, ప్రభుత్వం తరఫున అండగా వుంటాం.. అని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. డిసీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆత్మ బలిదానానికి పాల్పడ్డ వ్యక్తి కుటుంబానికి చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేశారు. సరిగ్గా చూస్తే, ఈ ఎపిసోడ్‌ మొత్తం పక్కాగా డిజైన్‌ చేయబడినదేనని అర్థమయిపోతుంది. 

ఇప్పుడిక పవన్‌, అఖిలప్రియను ఒంగోలుకు పిలిచారు. చంద్రబాబు, పవన్‌ సూచనతో అఖిలప్రియను ఒంగోలుకు పంపిస్తారు. అంతే, అక్కడితో పనైపోయింది. ఇది పవన్‌ గెలుపు.. కాదు కాదు, చంద్రబాబు సర్కార్‌ గెలుపు.! పోయిన ప్రాణాల సంగతేంటి.? అని మాత్రం అడక్కండి.. అదంతే.