ఓట్ల యావ : మసాలా పులుముతున్న మోడీ

మణిశంకర్ అయ్యర్ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీకి భగవత్ ప్రసాదితమైన ఒకవరం. గుజరాత్ ఎన్నికల సమరాంగణంలో ఆయన ప్రచారం మొత్తం ఇప్పుడు దారి మళ్లింది. తనను అయ్యర్ తిడితే.. ఆ తిట్లు యావత్ గుజరాత్ ను తిట్టినట్టుగా రంగు పులమడానికి ప్రధాని నరేంద్రమోడీ ఉబలాటపడుతున్నారు. ఈలోగా ఆయన సహాయకుల బృందంకూడా చాలా రంజైన పనిచేసింది.modinpp

గత కొన్నేళ్లలో కాంగ్రెసుకు చెందిన ఏయే నాయకులు మోడీని ఏయే తిట్లతో దూషించారో.. అంతా జాబితా కట్టి ఆయనకు పంపించింది. మోడీ ఆ జాబితా పట్టుకుని ఎన్నికల ప్రచార సభల్లో తిరుగుతున్నారు. తనను తిట్టిన తిట్లన్నీ ఆయనకు వరాల్లాగా కనిపిస్తున్నాయి. వారు తనను ఈ విధంగా తిడుతున్నారు గనుక… యావత్ గుజరాతీలను కాంగ్రెస్ తిట్టినట్టుగా అందరూ భావించి.. తన పార్టీకి ఓటు వేయాలనే చీప్ రాజకీయాలను ప్రధాని నరేంద్రమోడీ ఆశ్రయిస్తున్నారు.

తాను నిజాయితీ పరుణ్ని అని, తన మీద అవినీతి ఆరోపణల మరకలు లేవని నరేంద్రమోడీ జబ్బలు చరచుకోవచ్చు గాక.. కానీ ఆయన కూడా ఇలాంటి చవకబారు రాజకీయ టెక్నిక్కులకు అతీతమైన పాజిటివ్ రాజకీయాలు నడిపే వ్యక్తి కాదని ఈ పరిణామాలతో తేలిపోతోంది. అన్నిటినీ మించిన సంగతి ఏంటంటే.. మణిశంకర్అయ్యర్ పాకిస్తాన్ లో చేసిన వ్యాఖ్యలకు ఈయన మసాలా పులమడం.

‘మోడీని దారిలోంచి తొలగించనంత వరకు పాకిస్తాన్-ఇండియా సంబంధాలు మెరుగుపడవు’ అని అప్పట్లో అయ్యర్ వ్యాఖ్యానించారుట. అయితే ఆ వ్యాఖ్యల అర్థం తనను చంపేయాలనడమే అన్నట్లుగా మోడీ ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అంతటితో ఆగలేదు.. ఆ పాకిస్తాన్ పర్యటనలో మోడీని చంపడానికి పాకిస్తాన్ లోని వారికి అయ్యర్ సుపారీ ఇచ్చి వచ్చినట్లుగా కూడా మోడీ చెబుతున్నారు.

ఇదంతా ఆయన పులుముతున్న మసాలా వ్యవహారమే. రాజకీయాల్లో అతిశయోక్తులను ఆశ్రయించి ఆరోపణలు గుప్పించి.. లబ్ధి పొందాలనుకోవడం సహజమే. కానీ అలాంటి నేలబారు ఎత్తుగడలకు అతీతమైన రాజకీయ నాయకులు ఒక్కరు కూడా ఉండరా? అనేదే ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహం. మోడీ నిజాయితీని పక్కన పెట్టండి.. రాజకీయ వ్యూహాల్లో పరిశుద్ధుడు, మహానుభావుడు అని ఎవరికైనా భ్రమలుంటే.. ఇలాంటి కామెంట్లు చూసి అవి తొలగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.