ఔను..వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

పెళ్లి చేసుకున్నవిరాట్‌, అనుష్క
ఇటలీలో సన్నిహితుల మధ్య వేడుక
వివాహానంతరం అధికారిక ప్రకటన

కోహ్లి వెంట అనుష్క.. ఇది ఇకపై వార్తే కాదు! వాళ్లిద్దరూ కలిసి కనిపిస్తే ఇక ఆశ్చర్యాలేమీ లేవు! ఇందులో వివాదాలకూ తావు లేదు! ఎందుకంటే ఇప్పుడు వాళ్లిద్దరూ కేవలం ప్రేమికులు కాదు.. వివాహ బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు. ఇక వారి బంధం అధికారికం. నాలుగేళ్ల ప్రేమ ప్రయాణానికి సార్థకత చేకూరుస్తూ.. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు, ఉత్కంఠకు తెరదించుతూ.. విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ పెళ్లి చేసుకున్నారు. దేశానికి దూరంగా.. హడావుడి లేకుండా.. ఇటలీలో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఈ జోడీ. డిసెంబరు 12న, మంగళవారం విరాట్‌అనుష్క పెళ్లి అంటూ వారం రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. ఒక్క రోజు ముందే, సోమవారం ఈ జంట ఒక్కటైంది. ఉదయం పెళ్లి జరగ్గా.. రాత్రి తమ పెళ్లిపై ఉమ్మడిగా అధికారిక ప్రకటనను, ఫొటోలను విడుదల చేశారు విరాట్‌, అనుష్క.
ఎప్పటికీ ప్రేమ బంధంలోనే ఉంటామని ఈ రోజు మేమిద్దరం ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నాం. ఈ సమాచారాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతుతో ఈ అందమైన రోజు మరింత ప్రత్యేకంగా మారుతుంది. మా ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా ఉన్నందుకు ధన్యవాదాలు’’