కాంగ్రెస్‌పై నెహ్రూ కుటుంబానిదే ఆధిపత్యం

స్వాతంత్య్ర ఉద్యమానికి వేదికగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఒకప్పుడు బహుళత్వానికి మారుపేరుగా ఉండేది. స్వాతంత్య్రానికి ముందు దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన వారు ఆ పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక కాగా, స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నెహ్రూ కుటుంబ సభ్యులే ఎక్కువ కాలంపాటు ఈ పదవిలో ఉన్నారు. 1947 తరువాత మొత్తం 38 ఏళ్ల పాటు నెహ్రూ కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా కొనసాగారు. అందులో ఒక్క సోనియా గాంధీయే వరుసగా 19 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం రికార్డు.

132 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రథమ అధ్యక్షునిగా 1885లో ఉమేష్‌ చంద్ర బెనర్జీ బాధ్యలు చేపట్టారు. 1891లో తెలుగువారైన (చిత్తూరు జిల్లా కట్టమంచి) పనప్పాకం ఆనందాచార్యులు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ కాలంలో అయిదుగురు విదేశీయులు కూడా ఈ పదవికి ఎన్నిక కావడం విశేషం. 1888లో స్కాట్‌లాండ్‌ వ్యాపారి జార్జి యూలే, 1889, 1910లో ఇండియన్‌ సివిల్‌ సర్వీసు మాజీ అధికారులయిన సర్‌ విలియం వెడ్డెర్‌బర్న్‌, సర్‌ హెన్రీ కాటన్‌, బ్రిటన్‌ దిగువ సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌) సభ్యుడు ఆల్ఫ్రెడ్‌ వెబ్‌లు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. హిందూ మహాసభ వ్యవస్థాపకుడు పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ 1909, 1918ల్లో రెండు సార్లు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. తండ్రీ కుమారులైన మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూలు అధ్యక్షులు కావడం ఇంకో విశేషం. జాతిపిత మహాత్మాగాంధీ 1924లో బెల్గాంలో జరిగిన సమావేశాల్లో అధ్యక్షుడయ్యారు. కాంగ్రెస్‌కు ఇంతవరకు మొత్తం నలుగురు మహిళలు అధ్యక్షురాళ్లుగా వ్యవహరించగా అందులో స్వాతంత్య్రానికి ముందు అనీబిసెంట్‌ (విదేశీయురాలు), సరోజినీ నాయుడు ఉన్నారు. స్వాతంత్య్రం సాధించిన తరువాత 15 మంది కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎన్నిక కాగా, వారిలో 11 మంది నెహ్రూ కుటుంబానికి చెందని వారు. 1948-49లో భోగరాజు పట్టాభి సీతారామయ్య, 1960 నుంచి 63 వరకు నీలం సంజీవరెడ్డి, 1992 నుంచి 1996 వరకు పి.వి.నరసింహారావులు ఈ పదవిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *