నాది ఉడుంపట్టు

పోలవరం పూర్తి చేసే సలహాలే వింటా
అడ్డుకోవాలనుకుంటే లెక్కే చేయను
గడ్కరీ సహకరిస్తామన్నారు..
రమ్మంటే దిల్లీ వెళ్తా..
గుత్తేదారుల కన్సార్టియం ఏర్పడుతోంది..

‘పోలవరంపై ఉడుంపట్టు నాది. వదిలిపెట్టను. ప్రాజెక్టును పూర్తి చేసి తీరతా..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ‘రూపాయి అవినీతి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఎవరైనా దీని నిర్మాణం పూర్తి చేసేలా సలహాలు ఇస్తే వింటా. అడ్డుకుందామని చూస్తే లెక్కే చేయను’ అని కుండబద్దలు కొట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో సోమవారం ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించాక స్పిల్‌వే వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘ప్రాజెక్టును 2019లోపు పూర్తి చేసేలా 2018కి వాలు(గ్రావిటీ) ద్వారా నీళ్లిచ్చేలా కేంద్ర మంత్రి గడ్కరీ సహకరిస్తానన్నారు. అవసరమైతే ఆయన రమ్మంటే మళ్లీ దిల్లీ వెళ్తా’ అని ప్రకటించారు. ఎగువ కాఫర్‌డ్యాంపై శుక్రవారానికల్లా నివేదిక ఇస్తామని ఎన్‌హెచ్‌పీసీ కమిటీ పేర్కొందని చెప్పారు. పోలవరం టెండర్లు యథాతథంగా కొనసాగుతున్నాయని, ఇందుకు సమాంతరంగా ప్రధాన గుత్తేదారు కన్సార్టియం ఏర్పాటుచేసుకుని పనులను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఆ కన్సార్టియంతో పనులు చేయించే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్థిక సమస్యలపై త్రిసభ్య సంఘం చర్చిస్తోందన్నారు. గుత్తేదారుతో కుదిరిన ఒప్పందం మేరకు రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదు కదా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించగా.. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఉపయోగపడని ఒప్పందం ఎందుకని ముఖ్యమంత్రి ఎదురు ప్రశ్నించారు. వైకాపా నాయకులు చెబుతున్నట్లు ఇక్కడ మట్టిదిబ్బలే ఉన్నాయా చెప్పండి? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ శ్వేతపత్రం అడిగారు.. 2018లోపు ప్రాజెక్టు పూర్తి కాదన్నారు.. మీరేమంటారని విలేకరులు ప్రశ్నించగా.. ‘అనుభవం ఉన్న నేనే తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది జగన్‌ను తీసుకొచ్చి చూపిస్తే ఏదేమిటో తెలుస్తుందా? ఒక్కసారి వచ్చి చూసి ఏదేదో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ఏమనాలి? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు అడ్డుపడేవాళ్లు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని పునరుద్ఘాటించారు.