తెలంగాణ గౌరవానికి ప్రతీక

కనులపండువగా తెలుగు మహాసభల నిర్వహణ
అందరూ ఆహ్వానితులే
ప్రతి ఒక్కరికీ చక్కటి ఆతిథ్యమివ్వాలి
భాష, సాహిత్యాలకు ప్రాధాన్యం
జ్ఞాన్‌పీఠ్‌ పురస్కార గ్రహీతలకు సన్మానం
ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తెలంగాణ గౌరవానికి ప్రతీక అని, కన్నులపండువగా కార్యక్రమాలు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇదో బృహత్కార్యమని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా ప్రముఖులు హాజరవుతున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ఈ మహాసభలకు అందరూ ఆహ్వానితులే. వచ్చిన వారందరికీ చక్కటి ఆతిథ్యమివ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. సాహిత్యం, భాషా ప్రాధాన్యంగా మహాసభలను నిర్వహించాలని, ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో ప్రారంభ, ముగింపు సమావేశాలతో పాటు అయిదురోజులు సాయంత్రం పూట సాంస్కృతిక
కార్యక్రమాలు ఘనంగా జరగాలన్నారు. సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో నాలుగు గంటల పాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘మహాసభలతో మన ప్రతిష్ఠ ఇనుమడించాలి. ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ హాజరవుతున్నారు.ఉపరాష్ట్రపతి ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ ప్రకటన చేసిన వెంటనే పెద్దఎత్తున బాణసంచా కాల్చాలి. ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఆయనకు బ్రహ్మాండంగా స్వాగత సత్కారాలు చేయాలి.
ఒక్కో వేదికపై ఒక్కొక్కరికి బాధ్యతలు
ప్రధాన వేదిక ఎల్బీస్టేడియంతో పాటు మిగిలిన అన్ని వేదికల పర్యవేక్షణ బాధ్యత ఒక్కొక్కరు తీసుకోవాలి. భోజనాలు, బస, ఇతర ఏ సమస్య లేకుండా చూడాలి. కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతినిధులతో మాట్లాడి, వారి అభిలాషకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు కల్పించాలి. ప్రతి రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మీద ప్రత్యేకంగా రూపొందించిన లఘుచిత్రాన్ని ప్రదర్శించాలి. సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరగాలి.