అందరి లెక్కలు తేలుస్తాం: ట్రంప్

‘నాపై పత్రికల్లో వచ్చిన కథనాలన్నీ పిచ్చిరాతలు.. పచ్చి అబద్ధాలు..’ అని కొట్టిపారేసిన డొనాల్డ్ ట్రంప్‌.. ప్రత్యర్థి డొమొక్రటిక్ పార్టీ నేతల కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని బాంబు లాంటి వార్త పేల్చారు. ఎన్నికల సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చేతులు కలిపారని, ఆ దేశ అధికారుల సాయం వల్లే విజయం సాధించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 90 రోజుల సమయంలో అందరి లెక్కలు తేలుస్తానని మరో ఎనిమిది రోజుల్లో అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్ వ్యాఖ్యానించారు.

హ్యాకింగ్ విషయంపై తాను దృష్టిపెట్టినట్లు పేర్కొన్న ట్రంప్.. యాంటీ హ్యాకింగ్ టీమ్ ఏర్పాటుచేసి ఎన్నికల సమయంలో జరిగిన సైబర్ దాడుల వివరాలను ప్రజలకు తెలియజేస్తానని తెలిపారు. ప్రతిరోజు అమెరికా అధికారిక, అనధికారిక వెబ్‌సైట్లను రష్యాతో పాటు చైనా, మరికొన్ని దేశాలు హ్యాక్ చేయాలని తీవ్రంగా యత్నిస్తాయని ఆరోపించారు. తమ నుంచి ఎంతో లబ్ధిపొందిన జపాన్, చైనా, రష్యా, మెక్సికో దేశాలు అమెరికాను గౌరవించాలన్నారు. ఇటీవల జరిగిన సైబర్ దాడి వల్ల 22 మిలియన్ల వ్యక్తుల వివరాలను కోల్పోయాయని, ఇది కచ్చితంగా చైనా చర్యేనని ట్రంప్ ఆరోపించారు.

‘ప్రపంచంలో గ్రేటెస్ట్ కంప్యూటర్ మైండ్ ఉన్న ఆరుగురిని సెలెక్ట్ చేసుకుంటాం. వారందరినీ ఒక్కటిగా చేసి.. సైబర్ దాడులకు అడ్డుకట్ట వేస్తాం. సైబర్ దాడులపై వచ్చిన ఆరోపణలపై పూర్తి సమాచారాన్ని రిట్రీవ్ చేసుకుంటాం. సైబర్ సెక్యూరిటీని పూర్తిస్థాయిలో మెరుగు పరిచి ఏ దేశానికి హ్యాకింగ్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తాం. 90 రోజుల్లో హ్యాకింగ్ కు గురయిన డేటా వివరాలపై పూర్తిస్థాయి నివేదిక రూపొందిస్తాం’ అని డొనాల్ట్ ట్రంప్ వివరించారు.
Donald Trump, Hacking report, cyber attacks, Russia,