కాళేశ్వరంతో ఆసియా రికార్డు: హరీశ్‌

చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆసియాలోనే రికార్డు నెలకొల్పాలని, అక్టోబర్‌ నాటికి తెలంగాణ పొలాలకు గోదావరి జలాలు తరలించాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అ ని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. దీనికోసం ఇరిగేషన, రెవెన్యూ, అటవీ, విద్యుత, గనులు తదితర శాఖల కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో పనిచేసి గడువులోగా ఫలితాలు సాధించాలన్నారు. బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల డిజైన్లను ప్రాధాన్యతగా గుర్తించి వెంటనే సమర్పించాలని సీడీవో సీఈకి సూచించారు. ఈ ప్రాజెక్టు పనులను అధికారులు, ఇంజనీర్లతో మంత్రి సోమవారం సమీక్షించారు. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల నిర్మాణ పనులను తెలుసుకున్నారు. బ్యారేజీలతో పాటు పంప్‌హౌజ్‌ల పనులనుకూడా ఏకకాలంలో చేపట్టాలన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌ పనులు ప్రారంభించామని అధికారులు మంత్రికి తెలిపారు. రోజూ 35 వేల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌వర్క్‌ జరుగుతున్న పంప్‌హౌజ్‌ నిర్మాణ పనులను 60వేలకు పెంచాలన్నారు. ఈ సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ఈఎనసీ మురళీధరరావు, డిజైన్ల సీఈ నరేందర్‌రెడ్డి, కాళేశ్వరం సీఈలు తదితరులు పాల్గొన్నారు.