నెటిజన్లకు కన్నీరు తెప్పిస్తున్న ఖైదీ నెం.150 సినిమా పాట!

మన దేశంలో నీళ్లు లేక ప్రాజెక్టులు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయేమో కానీ రైతు కంట కన్నీరు ఆగిన సందర్భాలు లేవు. దాహంతో పుడమి తల్లి ఎండిపోతుంటే, తల్లికిన్ని నీళ్లివ్వలేని స్థితిలో ఉన్నానే అని అన్నదాత కుమిలికుమిలి ఏడుస్తున్నాడు. ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆ వరుణుడి దయ వల్ల పుష్కలంగా నీరొచ్చి పంట పండినా మద్ధతు ధర లేక నష్టానికైనా కష్టంగా అమ్ముకుంటున్న రైతన్నల స్థితి దయనీయం. చాలని నీళ్లు, వెక్కిరించే బీళ్లు, చేసిన అప్పులు, కరెంట్ తిప్పలు, ఎండిన డొక్కలు, వీడని చిక్కులు, బతుకంతా గతుకులు, గొంతు దిగని మెతుకులు, చివరకు చెట్టు కొమ్మలకు వేలాడే ఉరి తాళ్లు, పురుగుల మందుకు బలైపోయే ప్రాణాలు, గెలిచే ముందు పార్టీల మాటలు, గెలిచాక నీటి మూటలు. ఇంతకన్నా ఏముంది ఇన్నాళ్ల మన స్వతంత్ర భారతంలో అని ఆ రైతన్న నీరసంగా నిట్టూరుస్తున్నాడు.

అలాంటి రైతన్న కష్టాలపై చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెం.150 సినిమాలో ఓ పాటను రూపొందించారు. రైతు కష్టాలకు కరగని వారుండరు. అదే విషయం ఈ పాట యూట్యూబ్ వ్యూస్‌లో కూడా నిజమైంది. అప్‌లోడ్ చేసిన 19గంటల్లోనే 8లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ పాట ఎంతలా హృదయాలను కదిలించిందో చెప్పొచ్చు. నాన్నకు ప్రేమతో సినిమాలోని నాన్న పాటతో కళ్లలో నీళ్లు తెప్పించిన దేవీశ్రీప్రసాద్ ఈ రైతన్న పాటతో మరోసారి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. నీరు నీరు నీరు… అంటూ సాగే ఆ పాటను మీరు కూడా వినండి.