ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్న సమాచార శాఖ-మండిపడతున్న అధికార పార్టీ నాయకులు

 

పైకి ప్రభుత్వానికి ఎంతో సేవ చేస్తున్నట్లు నటిస్తూ, ప్రభుత్వాన్ని ఎలా అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్న పత్రికలకు కొమ్ముకాస్తు, తెలంగాణ పత్రికలను చిదిమేస్తే, ఆ పత్రికలు రాసేవే వార్తలుగా, నిజాలుగా, సమాచారంగా ప్రజల్లోకి వెళ్లేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్న ప్రచారం విసృతంగా సాగుతోంది. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు తెలిసినా, బైటికి చెప్పలేని స్థితిలో వున్నట్లు కూడా తెలుస్తోంది. ఉద్యమ కాలంలో ఏ పత్రికలైతే తెలంగాణ వాదాన్ని పిడివాదమని, ఎప్పుడు చిదిమేద్దామా అన్నట్లు సాగిన వైనం ప్రపంచానికి తెలియంది కాదు. తెలంగాణ వచ్చినా, తెలంగాణ పరిపాలన గురించి తొలినాళ్లలో ఆయా పత్రికలు చేసిన హంగామా అప్పుడే మర్చిపోయిన సమచారశాఖ, తెలంగాణ పత్రికలను చిదిమేస్తేనే, ప్రభుత్వాన్ని ఎంతో కొంత ఇరుకున పెట్టొచ్చన్న వారి కుట్రలో భాగమైపోయిందన్న అనుమానాలకు తావిచ్చే కార్యక్రమాలను బహిరంగంగానే చేపడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధన దిశగా నిరంతరం శ్రమిస్తుంటే, తెలంగాణ పత్రికల్లో ఆ సమచారం విసృతమౌతుంటే పట్టించుకోకుండా, పెద్ద పత్రికలుగా సమాచార శాఖకు మాత్రమే కనిపిస్తున్న పత్రికలకు కొమ్ముకాస్తున్నారు.npp

ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొంత ప్రభుత్వం దృష్టికి వచ్చినా, అంతా సర్ధుబాటు చేస్తానని ఆ శాఖ పెద్ద అధికారి చెప్పి, అదే పనిని సాఫీగా సాగిస్తున్నారని జర్నలిస్టు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా తాను చేయాల్సింది తాను చేస్తానన్నట్లుగానే ఆ అధికారి వ్యవహరిస్తూ, నిజానికి తెలంగాణలో వున్నవన్నీ చిన్న పత్రికలే. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకున్నవి చిన్న పత్రికలే. కాని ఏ తెలంగాణ పత్రిక తెలంగాణ వచ్చిన తర్వాత మనుగడే కష్టమౌతుందని ఏనాడు ఊహించలేదు. కాని సమాచార శాఖ ఉన్నతాధికారి ఆలోచనలు మొత్తం చిన్నపత్రికలను చిన్న చూపు చూసేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప వాటికి ప్రోత్సాహం కల్పిస్తామన్న ఆలోచనలు చేయడంలేదు. పైగా తెలంగాణ పత్రికలంటేనే ఆయన చిన్న చూపు చూస్తూ, ఆ పత్రిక ఎడిటర్లను అవమానిస్తున్నారు. చిన్న పత్రికల సామర్థ్యాన్ని వెక్కిరిస్తున్నారు. మీ పత్రికలవల్ల ఒరుగుతుందేమిటీ అన్నంతగా మాట్లాడుతున్నారు. దేశ స్వాతంత్య్రంలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన పత్రికలు కూడా చిన్నవే. మహాత్మాగాంధీ లాంటివారు సైతం నడిపించిన పత్రికలు ఆనాడు సమాజాన్ని మేలుకొలేపేందుకు పుట్టాయి. అలాగే తెలంగాణలోనూ ప్రముఖ పాత్ర పోషించాయి. బలవంతమైన సర్పము చలి చీమల చేతి చిక్కి చావదే సుమతీ అన్న పద్యం తెలియని అధికారికి తెలంగాణ పత్రికల విలువ తెలియడంలేదు. తమ పరిదిలో తెలంగాణ వాదాన్ని వినిపించి విసృతం చేసిన తెలంగాణ పత్రికలు నేడు ప్రభుత్వం కలలు గంటున్న బంగారు తెలంగాణ కోసం తాము భగస్వాములుగా కదులుతుంటే చూస్తూ ఓర్వలేని కొంత అధికారులు చిన్న పత్రికల అవసరం మాకు లేదన్నట్లు వ్యహరిస్తున్నారు. తెలంగాణ పత్రికలకు ప్రకటనల్లో మొదలైన కోతలు, అక్రిడిటేషన్‌ కార్డులదాకా తీసుకెళ్లి రేపటి రోజున పత్రికలు కనిపించకుండా కుట్రలు చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వానికితెలియకుండా తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. జాతీయ స్థాయిలో పత్రికలకు అనుమతిస్తున్న శాఖ వుండగా, నేడు కొత్తగా పత్రికలను ఎం ప్యానల్‌ పేరుతో తొలి వేదింపుకు అడుగు పడింది. చిన్న పత్రికల్లో కేటగిరీలు చేసి, ఎవరైతే అధికారుల అడుగులకు మడుగులొత్తుతున్నారో, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్నారో, సీమాంధ్రకు చెందిన పత్రికలకు పెద్ద పీట వేసి వారిని మాత్రమే గుర్తించి, మిగతా పత్రికలను సి,డిలుగా ముద్రవేసి వాటిని చిదిమేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డి కేటగిరీలో వున్న పత్రికలపై ఆయన చూపిస్తున్న అక్కసు అంతా ఇంతా కాదు. వాటిని గుర్తించాల్సిన పని లేదన్నట్లుగా, అవి దొంగ పత్రికలని బహిరంగంగానే చెబుతున్నారు. పత్రికలను దొంగ పత్రికలని సమాచార శాఖ నిర్ణయం చేయొచ్చా? ఇంతటి బరితెంగింపేమిటీ అని ప్రశ్నించేందుకు కూడా యూనియన్లు ముందుకు రాకపోవడం కూడా ఇక్కడ మరో తతంగం నడుస్తోంది? ఎవరికి వారు, తమ స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నవారు, స్వార్థపరులు, సమాచార శాఖ అడుగులకు మడుగులొత్తుతూ, పత్రికారంగ విలువలను భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమఫలాలు ప్రజల్లోకి మరింత విసృతంగా తీసుకెళ్లాలన్న ఆలోచన వుండీ, ప్రత్యేక సంచికల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమపడుతున్నవారిని దగ్గరకు కూడా రానియ్యకుండా అడ్డుకుంటున్నారు. తెలంగాణ పత్రికలంటే ఆ అధికారికి చిన్న చూపుకు కారణాలు అనేకం వున్నాయన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఓ పథకం ప్రకారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు కుటిల యత్నాలు చేస్తూనే, ప్రభుత్వానికి తానే ఎంతో చేస్తున్నట్లు పైకి కనబడుతున్నారు. జర్నలిస్టులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదు. తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వని అధికారి ఆ స్థానంలో వుండడంతో ఎంతో మంది చిన్న పత్రికల ఎడిటర్లు అనేక సమస్యలుఎదుర్కొంటున్నారు. తెలంగాణ పత్రికా వ్యవస్థలో తానే సమూల మార్పులు తీసుకొస్తున్నానన్న భ్రమలో వున్నారు. తెలంగాణలో వున్న పత్రికా వ్యవస్థలో ఉన్నత విద్యావంతులు వుండాలన్న నిబంధనను తీసుకొచ్చి, తాను గొప్ప సంస్కర్తగా ఆ అధికారి మాట్లాడడం విడ్డూరంగా వుంది. పెద్ద పెద్ద పత్రికలుగా చెలామణి అవుతున్న పత్రికల్లో ఉన్నత విద్యావంతులై, రిపోర్టర్లుగా పనిచేస్తున్నవారికి ఎంత జీతాలు ఇస్తున్నారన్న సమచారం ఏనాడైనా సేకరించారా? వారికి ఖచ్చితంగా జీతాలు నెలనెలా, కార్మిక చట్టాలను అనుసరించి ఇవ్వాలన్న రూల్‌ ఏమైనా ప్రేమ్‌ చేశారా? చాలీ చాలని జీతాలతో ఈ రంగంలోకి వచ్చి, చచ్చీచెడి బతుకుతున్నవారి జీవితాల గురించి ఆ అధికారికి తెలుసా? ఉద్యోగ భద్రత అంటే ఏమిటో తెలియని వ్యవస్థలో ఎంత మంది రిపోర్టర్లు అర్థాకలితో అలమటిస్తున్నారో ఆ అధికారికి తెలుసా? లక్షలాది రూపాయల ప్రకటనలు నెలనెల వారికి విడుదల చేస్తూ, విలేఖరులకు ఎంత జీతాలు విదుల్చుతున్నారో తెలుసా? తాము అనుకున్న విధంగా కాకుండా, పనిచేసే విలేఖరి మరుసటి రోజు ఉద్యోగంలో వుంటాడో వుండడో అధికార యాంత్రాంగం పర్యవేక్షించిందా? వేజ్‌ బోర్డు నిబంధనల మేరకు ఎంత మంది రిపోర్టలకు జీతాలు అందుతున్నాయో వివరాలు సేకరించారా? వారికి సంక్షేమం కోసం ఏ పత్రికైనా సక్రమంగా కార్మిక చట్టాలు అమలు చేస్తోందా? ఈ విషయాలన్నీ పట్టించుకోని సమాచార శాఖ , చిన్న పత్రికల్లో మాత్రం కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్లు నటిస్తోంది. ఉద్యమ కాలంలో ఎంతో మంది జర్నలిస్టులు తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు, ప్రయత్నించి, శ్రమించి, ఉద్యోగాలను కోల్పోయి, చిన్న పత్రికల ద్వారా తమ ఆశలు, ఆశయాలు, ప్రజల భావనలు వెలుగులోకి తీసుకొచ్చి, విలేఖరుల భాగస్వామ్యంతో నడుస్తున్న పత్రికలను చిదిమేస్తే వేలాది కుటుంబాలు వీధినపడతాయన్నది తెలియడంలేదా! పత్రికారంగంలో ఉన్నత విద్యావంతులు వుండాలన్న ఆలోచన మంచిదే. కాని కవిత్వానికి, సామాజిక సృహ అన్నది వ్యక్తి మనస్తత్వానికి సంబంధించినదే తప్ప, విద్యారంగానికి చెందినది కాదు. తాను, సమాజం అన్న ఆలోచనలు వారు మాత్రమే పత్రికారంగానికి వస్తారన్న కనీస సృహ లేనివారు అధికారిగా వుంటే ఏ వ్యవస్థ అయినా భ్రష్టుపట్టిపోతుందనడానికి ఇంత కన్నా సాక్ష్యం మరొకటిలేదు. ఓ వ్యక్తి ఉన్నత విద్యావంతుడైనంత మాత్రాన పత్రికరంగాన్ని ఎంచుకోరు. సామాజిక సృహ అన్నది జీర్ణించుకున్నవారే పత్రికారంగాన్ని ఎంచుకుంటారు? ఇది నూటికి నూరుపాల్లు సత్యం. మనత్వానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి తన జీవితాన్ని, భవిష్యత్తును ఎంచుకోలేరు. అసలే జీతాలు లేని ఉద్యోగాలు జర్నలిస్టు జీవితాలన్న సత్యం సమాజంలో అన్ని వర్గాలకు తెలుసు. అలాంటప్పుడు ఈ రంగంవైపు మళ్లాలన్న ఆలోచన చేసిననాడే తాను జీవితాన్ని సమాజానికి అంకితం చేస్తున్నట్లు లెక్క. అలాంటి వ్యక్తులుగా సమాజంలో కలం పట్టుకొని గర్వంగా నేను జర్నలిస్టునని చెప్పుకునేవారిని అసలు జర్నలిస్టులే కాదన్నట్లు, పత్రికలు అసలు పత్రికలే కావన్నట్లు మాట్లాడుతూ, పురుడు పోసుకున్న తెలంగాణలో తెలంగాణ పత్రికాసమాజాన్ని చిదిమేయాలని చూస్తున్న అధికార యంత్రాంగం మూలంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీతోపాటు, ప్రభుత్వం కూడా పెద్ద అప్రదిష్టను మూటగట్టుకుంటోందన్న సత్యాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఉద్యమ కాలంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసిఆర్‌ చెప్పింది కేవలం సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో వున్న పత్రికల సంక్షేమం కాదన్నది సమాచార శాఖ అధికారులు తెలుసుకోవాలి. తెలంగాణ పత్రికలను కాపాడాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆ శాఖ పనితీరుపై నిరసనలు వెల్లువెత్తేందుకు ఎంతో కాలం పట్టదని జర్నలిస్టులు చెబుతున్నారు.