మన్మోహన్‌కు.. మోదీకి.. తేడా ఏమిటంటే..?

‘మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రసంగాలన్నీ ఇంగ్లి్‌షలోనే ఉండేవి. వాటిని నాలాంటి గ్రామీణులెవ్వరూ అర్థం చేసుకోలేకపోయేవారు. ప్రస్తుత ప్రధాని మోదీ మాకు అర్థమయ్యే భాషలో చక్కగా హిందీలో మాట్లాడుతాడు అందుకే ఆయన ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నాం. ఆయనపై మా అందరికీ నమ్మకం ఉంది’ … ఉత్తర్‌ ప్రదేశ్‌ లఖ్‌నవ్‌కు చెందిన 29 ఏళ్ల ఉబేర్‌ ట్యాక్సీ డ్రైవర్‌ రాఘవేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి. యూపీ ఎన్నికల ప్రచారంలో నోట్ల రద్దు ప్రధాన పాత్ర పోషించనుంది. రద్దు నిర్ణయం తమకు లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ చెబుతోంది. విపక్షాలు మాత్రం నోట్ల రద్దు నిర్ణయంతో కలిగిన దుష్పలితాలను ఓటర్లకు వివరించి ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో నోట్ల రద్దుపై యూపీలో సామాన్య ఓటర్‌ మనోగతం ఎలా ఉందో రాఘవేంద్ర సింగ్‌ ఆవిష్కరించాడు. నోట్ల రద్దు నిర్ణయం పేదలపై పెద్దగా ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డాడు. ‘పేదల వద్ద నోట్ల రద్దుకు ముందు డబ్బు లేదు.. నోట్ల రద్దు తర్వాత కూడా డబ్బు లేదని, అసలు డబ్బే లేనప్పుడు వారిపై ఆ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుంది’ అన్నది రాఘవేంద్ర ప్రశ్న. గ్రామీణులు సైతం ప్రస్తుతం పేటీఎంను బాగా ఉపయోగిస్తున్నారని, మొబైల్‌ ఫోన్ల ద్వారా చెల్లింపులు కూడా బాగా చేస్తున్నారని తెలిపాడు. నోట్ల రద్దు నిర్ణయం బడా వ్యాపారులపై ఏమైనా ప్రభావం చూపించి ఉండొచ్చని వ్యాఖ్యానించాడు. నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నులు బాగా పెరుగుతాయని, దీంతో పేదల పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులు కూడా ఎక్కువవుతాయని రాఘవేంద్ర విశ్లేషించడం గమనార్హం.