మోదిని ఓడిస్తా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడించి చూపిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు ఓ తప్పుడు నిర్ణయమని విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రపంచమంతా తప్పుపట్టిందన్నారు. తప్పుడు నిర్ణయం కారణంగా ప్రపంచంలో అవహేళనకు గురైన తొలి ప్రధానిగా మోదీ నిలిచిపోతారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుపై బుధవారం జరిగిన జన్‌ వేదన సభలో రాహుల్‌ మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే దేశానికి మంచి రోజులు (అచ్ఛేదిన్‌) వస్తాయన్నారు. నోట్ల రద్దు అనేది ప్రధాని వ్యక్తిగత నిర్ణయమని, ఈ నిర్ణయంతో దేశ ఆర్థికవ్యవస్థ 16 సంవత్సరాలు వెనుకబడిపోయిందన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో విక్రయాలు 60 శాతం పడిపోయాయన్నారు. దేశానికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదన్న బీజేపీ నేతల విమర్శలను రాహుల్‌ తిప్పికొట్టారు. దేశానికి ఆత్మ లాంటి ఆర్బీఐ, ఎన్నికల సంఘం, జ్యుడీషియరీ వంటి వ్యవస్థలను బలహీనపర్చడం తప్ప రెండున్నరేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమిటని నిలదీశారు. గత 70 ఏళ్లలో తాము చేయలేని పనిని మోదీ నేతృత్వంలోని బీజేపీ చేసిందని, కీలకమైన అన్ని వ్యవస్థల గౌరవాన్ని బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ దిగజార్చాయని విమర్శించారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కాంగ్రెస్‌ ఎప్పుడూ గౌరవించేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఎన్డీయే సర్కార్‌ నీరుగార్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు 100 రోజులపాటు ఉపాధి హామీ కల్పిస్తే దాన్ని మోదీ సర్కార్‌ లాగేసుకుందని విమర్శించారు. ప్రధాని పల్లెల్లోని పేదలతో కొద్దిసేపు గడిపి, వారు ఎందుకని పల్లెల నుంచి వలస పోతున్నారో తెలుసుకోవాలన్నారు. దేశానికి నష్టం కలిగించే పనులను ఏనాడూ కాంగ్రెస్‌ చేయలేదని కానీ రెండున్నరేళ్ల పాలనలో బీజేపీ దేశానికి తీవ్ర నష్టం కలిగించిందన్నారు. అధికారంలోకి రాకముందు మోదీ దేశంలోని దొంగలందరినీ పట్టుకొని హిందుస్థాన్‌ను శుద్ధి చేస్తానని ప్రకటించారని, అధికారంలోకి వచ్చిన మూడునాలుగు రోజులకే ఆ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. బీజేపీ, ఆరెస్సెస్‌.. ప్రజల్లో భయోత్పాత వాతావరణం సృష్టిస్తున్నాయని రాహుల్‌ విమర్శించారు. కాషాయ దళం సిద్ధాంతాలను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్‌ స్పష్టం చేశారు. ప్రజలు నిర్భయంగా జీవించాలని ఆశించే కాంగ్రెస్‌ సిద్ధాంతానికి.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే బీజేపీ సిద్ధాంతానికి నడుమ దేశంలో పోరాటం జరుగుతోందన్నారు. ప్రజల్లో భయాందోళనలను.. విద్వేష బీజాలను నాటడం ద్వారా దేశాన్ని పాలించవచ్చని బీజేపీ, ఆరెస్సెస్‌ భావిస్తుంటాయని రాహుల్‌ విమర్శించారు. వారి నమ్మకాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఓడించి అధికారంలోకి వస్తుందన్నారు.