యుద్ధం ఎవరు చేస్తున్నారు?

హిమాలయాలను తలపించే ఎల్తైన పర్వతాలు ఓ పక్క… సమయం చూసి సమరానికి దిగిన శత్రువులు మరోపక్క… ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘బాహుబలి’ వీరోచితంగా యుద్ధం చేస్తున్నాడు. ఈ వారం రోజులూ యుద్ధం చేయక తప్పదు. ఎందుకంటే… ఈ వారంలో ఎట్టకేలకు షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేస్తారట! ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా తదితరుల కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’. ‘బాహుబలి’కి సెకండ్‌ పార్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తీస్తున్న వార్‌ సీక్వెన్స్‌లో తండ్రి అమరేంద్ర బాహుబలి యుద్ధం చేస్తున్నాడా? కుమారుడు మహేంద్ర బాహుబలి చేస్తున్నాడా అనేది రాజమౌళి చెబితేనే తెలుస్తుంది. హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌ క్వారీలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రభాస్‌ తదితర పాత్రధారులతో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ వారంతో చిత్రీకరణ అంతా పూర్తవుతుందని సమాచారం. అంటే, మూడేళ్లుగా ‘బాహుబలి’ పాత్రకు అంకితమైన ప్రభాస్‌ ఇక ఫ్రీ కానున్నారు. ఆల్రెడీ ‘బాహుబలి–2’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ ఎప్పుడో ప్రారంభమయ్యాయి. ఈ ఏప్రిల్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Baahubali: The conclusion, Prabhas, SS. Rajamouli, Rana