రన్ వేపై 360 డిగ్రీల కోణంలో గింగిరాలు తిరిగిన జెట్ ఎయిర్ వేస్ విమానం

గోవా ఎయిర్ పోర్ట్‌లో జెట్ ఎయిర్ వేస్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. గోవా నుంచి ముంబైకి వెళ్లవలసిన జెట్ ఎయిర్ 9W 2374 విమానం డబ్లిమ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో పట్టుతప్పి, పక్కకు ఒరిగిపోయింది. దీంతో నేటి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బందికి పెద్దగా సమస్యలు తలెత్తలేదు. విమానం ఓ వైపునకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెంది, పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అయితే ఎలాంటి దుర్ఘటన జరగకపోయేసరికి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

జెట్ ఎయిర్ వేస్ విమానంలో 161 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ నుంచి సురక్షితంగా తరలించే క్రమంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని జెట్ ఎయిర్ వేస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జెట్ ఎయిర్ వేస్ బృందంతో పాటు ఎయిర్ పోర్టు అధికారులు ఈ ఘటనలో గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jet Airways, plane skidded, passengers are safe, Dabolim airport,