రామ్‌చరణే నా ట్రైనర్‌: చిరంజీవి

‘‘ఈ సినిమాలోని పాత్రకు తగ్గట్లు నన్ను నేను మలచుకోడానికి ఆహార నియమాలు పాటించాను. ఫిట్‌నెస్‌ కాపాడుకున్నాను. ఈ విషయంలో నాకు ట్రైనర్‌ రామ్‌చరణే. తనే నా డైటీషియన్, నా జిమ్‌ ట్రైనర్‌ కూడా’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. తొమ్మిదేళ్ల విరామానంతరం చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి, ఇతర అంశాల గురించీ చిరంజీవితో చేసిన ఇంటర్వ్యూ విశేషాలు…

ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లో వర్మపై, యండమూరిపై నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు?
హర్టయ్యాడు కాబట్టి ఫంక్షన్ల‌లో రియాక్టయ్యాడు నాగబాబు. మేం కూడా అలాంటి మాటలు విన్నప్పుడు హర్టవుతుంటాం. కానీ వాటికి నేను రియాక్ట్‌ కాను. వాటిని పట్టించుకోను. అందరూ ఒకలాగా ఉండాలని లేదు. నాగబాబు రియాక్టయ్యాడు. అది అతని గుణం. అతని ఎక్స్‌ప్రెషన్ గురించి మాట్లాడుకోవాలి కానీ, అతను వాడిన పదాల గురించి కాదు. దానిపై తర్జనభర్జనలు అవసరం లేదు. తన తరపునుంచి అదేమీ తప్పు కాదు. నేను పాజిటివ్‌గా ఉండాలనుకుంటాను. పాజిటివ్‌గా ఆలోచిస్తుంటాను.

మనపై వస్తున్న విమర్శకులపై ఫోకస్‌ పెట్టేకొద్దీ, రియాక్టయ్యే కొద్దీ వాటికి ఎక్కువ విలువిచ్చినట్లవుతుంది. మనం పట్టించుకోకపోతే వాటి విలువ కూడా తగ్గిపోతుంది. నా ఫ్యాన్స కూడా నా ఫిలాసఫీనే ఫాలో అవుతుంటారునుకుంటాను. వాళ్లు కూడా ఇలాంటి విమర్శల్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ‘చిరంజీవి అందరికీ సాఫ్ట్‌ టార్గెట్‌ అవుతున్నాడేంటి?’ అని అభిమానులు హర్ట్‌ అవుతుంటారు. అందువల్ల అనాలోచితంగా ఒకర్ని హర్ట్‌ చేయడమనేది ఎంతవరకు కరెక్టనేది అవతలి వాళ్లు ఆలోచించుకోవాలి. అలా విమర్శలు చేసేవాళ్లని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తాను.

వర్మతో మీకేమైనా గొడవలున్నాయా?
రామ్‌గోపాల్‌వర్మ గొప్ప వ్యక్తి. ఆయనతోటి నాకెందుకు గొడవలుంటాయి? మేం మంచి స్నేహితులుగానే ఉంటాం. ఎప్పుడు ఎదురుపడినా మాట్లాడుకుంటాం. ఆయనతోనే కాదు, ఎవరితోటీ ఏ గొడవలూ ఉండవు. అలాంటి గుణం మా కుటుంబంలోనే లేదు.