వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు సాయం అందించండి

తెలంగాణలో మార్చిలో జరగనున్న టెక్స్‌టైల్స్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కేంద్ర జౌళి మంత్రి స్మృతి ఇరానీ అంగీకరించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ బుధవారం ఆమెను కలిసి సదస్సుకు సహకారం అందించడంతో పాటు ముఖ్య అతిథిగా రావాలని కోరారు. అందుకు ఆమె సమ్మతించారు. స్మృతితో భేటీ అనంతరం కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. సదస్సుకు దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానించామని చెప్పారు. భేటీ సందర్భంగా స్మృతి దక్కనీ వూల్‌ గురించి తన ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు సహకారం అందించాలని, వ్యర్థాల శుద్ధి ప్లాంటు ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందించాలని కోరానన్నారు. సిరిసిల్లలో భారీ మరమగ్గాల సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలని, బడ్జెట్‌లో ఈ అంశాన్ని పెట్టడానికి కృషి చేయాలని కోరినట్లు చెప్పారు. చేనేత దుస్తులను ధరించాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపును స్మృతి అభినందించారని చెప్పారు. ఫ్యాషన్‌ డిజైనర్లను పిలిచి ఫ్యాషన్‌ షో ఏర్పాటు చేస్తే మంచి ప్రచారం లభిస్తుందని ఆమె సలహా ఇచ్చారని వెల్లడించారు. కేటీఆర్‌ నీతిఆయోగ్‌ సీఇవో అమితాబ్‌ కాంతను కలిశారు. సృజనాత్మక రంగం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అశోక్‌ లవాసాను కలిసి పెండింగ్‌ నిధులను త్వరగా విడుదల చేయాలని, ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను బడ్జెట్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం చేయాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన విషయం గుర్తు చేశారు.