హక్కులను హరిస్తోంది

జీవో 123పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాగునీటి ప్రాజెక్టులకు దాన్ని వర్తింపజేయొద్దు
సర్కారును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు
123 జీవో కింద ఇక భూములు కొనొద్దు.. ఒప్పందాలు చేసుకోవద్దు
ఇప్పటికే చేసిన భూ కొనుగోళ్లు చట్టవిరుద్ధమే
వాటి చెల్లుబాటుపై తుది విచారణలో తేలుస్తాం
2013 భూ సేకరణ చట్టం కింద భూములు తీసుకోవచ్చు
బాధితులకు పునరావాసం, పునర్నిర్మాణం కల్పించాలి
2013 చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేయరాదు
మౌలిక సదుపాయాల వంటి బాధ్యతలు రాష్ట్రానివే
రాష్ట్రం తెచ్చిన జీవో 190లో ఇవేవీ లేవు
బాధితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం లేదని వ్యాఖ్య

సాగునీటి ప్రాజెక్టులకు భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాధిత కుటుంబాలకు (భూ యజమానులు కాదు) 2013 భూ సేకరణ చట్టం పలు హక్కులు, ప్రయోజనాలు కల్పిస్తున l్నందున భూముల కొనుగోలు కోసం జీవో 123ను వర్తింపజేయడానికి వీల్లేదని కోర్టు తేల్చిచెప్పింది. ‘‘స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచి భూముల కొనుగోలు నిమిత్తం తెచ్చిన జీవో 123ను అమలు చేసుకునే అధికారం 298వ అధికరణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న వారి హక్కులను, ముఖ్యంగా 2013 భూ సేకరణ చట్టంలోని షెడ్యూల్‌ 2, 3 కింద ఉన్నవారి హక్కులను హరించేలా జీవో 123 ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ జీవో కింద సాగునీటి ప్రాజెక్టుల అవసరాల కోసం భూములను కొనడానికి వీల్లేదు’’ అని స్పష్టం చేసింది. అంతేకాక ఈ జీవో కింద ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోవడానికి వీల్లేదంది. అయితే 2013 భూ సేకరణ చట్టం కింద భూములను తీసుకోవడానికి ఈ ఉత్తర్వులు ఎంతమాత్రం అడ్డంకి కాబోవని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది.

జీవో 123 ద్వారా ఇప్పటికే భూములమ్మిన వారికి (భూ యజమానులకు) కాక, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునర్నిర్మాణం, పునరావాసం కోసం 2013 భూ సేకరణ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేగాక, జీవో 123 కింద ప్రభుత్వం కుదుర్చుకున్న భూముల కొనుగోలు ఒప్పందాలు కూడా చట్ట విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు సరైనవేనా అన్న ప్రశ్నకు తుది విచారణ సమయంలో స్పష్టతనిస్తామంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘2013 భూ సేకరణ చట్టం అమల్లో ఉండగా దాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 298వ అధికరణ కింద తనకున్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి జీవో 123 ద్వారా భూములు కొనుగోలు చేయవచ్చా? భూ సేకరణ చట్టంతో సంబంధం లేకుండా జీవో 123 స్వతంత్రమైనదా? 298వ అధికరణ కింద రాష్ట్రానికి ఉన్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించకుండా 2013 చట్టం అడ్డుకుంటోందా? ఈ ప్రశ్నలన్నింటినీ తుది విచారణ సమయంలో పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం తన 80 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ంలో పలు సాగునీటి ప్రాజెక్టుల కోసం 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని జీవో 123 ద్వారా భూములు కొనుగోలు చేస్తుండటాన్ని సవాలు చేస్తూ మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ తదితర జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. వాటిని సుదీర్ఘంగా విచారించి గత నవంబర్‌ 24న నిర్ణయాన్ని వాయిదా వేసిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం వెలువరించింది.