బూట్లు నాకే వాణ్నయితే మంత్రిగానే ఉండేవాణ్ని

ఎంపీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వేదికపై విస్తుపోయిన రాష్ట్ర మంత్రులు

బూట్లు నాకే వాడినే అయితే ఎప్పుడూ మంత్రిగానే ఉండేవాడినని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపైనున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

ఇదే ఊపులో జేసీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి వాళ్ల నాయన బుద్ధులు వచ్చుంటే ఎంతో కొంత మేలు ఉండేదన్నారు. వయసులో చిన్నవాడనే ఉద్దేశంతో ఆప్యాయంగా జగన్‌ను ‘వాడు’ అన్నానే తప్ప పొగరుతో కాదన్నారు. దానికే నాలుక చీలుస్తానంటావా? అంటూ శ్రీకాంత్‌రెడ్డిపై మండిపడ్డారు. మీ ఊరొచ్చా… ఎవరొస్తారో రండి… టచ్‌ చేసి చూడండంటూ చిందులు వేశారు.

పనిలో పనిగా సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. ఒకప్పుడు రక్తం ప్రవహించిన పులివెందుల ప్రాంతం.. నేడు కృష్ణాజలాలతో పులకించనుందని, ఇది చంద్రబాబువల్లనే సాధ్యమైందని ప్రశంసించారు. గూండాలా, రౌడీలా మాట్లాడిన జేసీని సీఎం చంద్రబాబు ప్రోత్సహించడాన్ని చూసి అధికారవర్గాలు విస్తుపోయాయి.
jc diwakar reddy, janmabhoomi meeting, paidipalem, ysr district,